
టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ రిమాండ్ విధించడంపై ఆయన భార్య అపర్ణ స్పందించారు. తాము ఊహించిందే జరిగిందని.. సాయంత్రం వరకు బెయిల్ ఇవ్వలేదంటే ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నామన్నారు. బండి సంజయ్ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తని.. పేపర్ లీకేజీలో ఆయన ప్రమేయం ఉండబోదని చెప్పారు. ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లోనూ ప్రశ్నిస్తున్నాడు కాబట్టే ఆయనను అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ఒక ఎంపీనే ఇలా వేధిస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.
బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్
బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకి తరలించారు. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను కరీంనగర్ తరలించారు. కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని వాదించారు లాయర్లు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ పై నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.