సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అంటే తెలుగు ప్రేక్షకులలో తెలియని వారుండరు. ఆయన స్టేజిపై ప్రసంగిస్తున్నారంటే నవ్వులకు, సంచలనాలకు కొదవ ఉండదు. ఆయన మాటలు , ఎలివేషన్లు అన్నీ ఒక్కసారిగా వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్ గా హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'K-ర్యాంప్' విజయోత్సవ సభలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీతో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అభిమానుల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి.
బండ్ల వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి?
'K-ర్యాంప్' ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరంను వేదికపైకి పిలిచిన బండ్ల గణేష్.. నేటితరం కొంతమంది హీరోల 'ఈగో' గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్‌ను మెచ్చుకుంటూ, ఆయన నిరాడంబరతను మెగాస్టార్ చిరంజీవి తొలిరోజులతో పోల్చారు. కొంతమంది ఒక్క సినిమా హిట్టయితే చాలు అర్ధరాత్రి కళ్లద్దాలు పెట్టుకుని, లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు వేసుకుని, నెత్తి మీద క్యాప్ పెట్టుకుని సూపర్‌స్టార్‌లా బిల్డప్ ఇస్తుంటారు. 'వాట్సాప్.. వాట్సాప్.. ఏం కావాలి?' అని మాట్లాడుతారు. కానీ కిరణ్‌ను చూడండి. ఎన్ని హిట్స్ కొట్టినా ఒదిగి ఉన్నాడు. ఇతను చిరంజీవి గారిని గుర్తు చేస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.
సినిమాను నమ్ముకున్న ఎవరూ నిరాశ చెందరని, కష్టం, నిజాయితీ ఉంటేనే విజయం వస్తుంది. వాట్సాప్ అంటే హిట్టు రాదు అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు నేరుగా హీరో విజయ్ దేవరకొండనే టార్గెట్ చేశాయని నెటిజన్లు, సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే, విజయ్ తన స్టైల్‌లో భాగంగా లూజ్ ప్యాంట్లు, క్యాప్స్ ఎక్కువగా ధరిస్తారు. ప్రమోషన్లలో 'వాట్సాప్' అనే పదాన్ని తరచుగా వాడతారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
గతం నుంచి కొనసాగుతున్న పోరు!
బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ మధ్య పరోక్ష విమర్శల పర్వం ఇదే తొలిసారి కాదు. కొద్ది నెలల క్రితం 'లిటిల్ హార్ట్స్' ఈవెంట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. యువ నటుడు మౌళీని ఉద్దేశించి 'విజయ్ నీకు RWDY షర్ట్స్ ఇచ్చినా, మహేష్ బాబు నీ గురించి ట్వీట్ చేసినా, ఇవన్నీ నమ్మకు. ఇండస్ట్రీలో ఇదంతా మాయ' అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఒక ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ దీనికి కౌంటర్‌గా బదులిచ్చారు. 'ఎవరి సలహాలనూ మనసుకు తీసుకోవద్దు. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టడమే జీవితంలో అతిపెద్ద విజయం. మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు 'మౌళీ' ఆ మౌళీనే వెలిగిపోవాలి, ఇంకెవరిలానూ ఉండాలని ఆలోచించొద్దు అని విజయ్, పరోక్షంగా బండ్ల గణేష్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.
విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం
'K-ర్యాంప్' ఈవెంట్ క్లిప్ వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ అభిమానులు బండ్ల గణేష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 'ఈర్ష్యతో విజయ్‌ని విమర్శించి, ఇప్పుడు కిరణ్ అబ్బవరం, తేజ సజ్జాల వెనుక పడుతున్నారు. డేట్స్ దొరక్కపోతే మళ్లీ ఇంకో హీరో దగ్గర ఇదే చేస్తారు అని ఒక అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరు, 'నిజాయితీ, సౌమ్యతకు పేరుగాంచిన విజయ్‌ని టార్గెట్ చేయడం కంటే, పరిశ్రమలోని నిజమైన సమస్యలపై బండ్లన్న దృష్టి పెడితే బాగుంటుంది అని కామెంట్ చేశారు.
— VVG Videos (@VVGVideos) November 3, 2025
విజయ్‌కి ఫ్లాప్‌లు రావడంతోనే బండ్ల గణేష్ ఇలా విమర్శిస్తున్నారని.. హిట్స్ ఉన్నప్పుడు పొగిడి, ఇప్పుడు ఫ్లాప్స్ వస్తే అవమానించడం తప్పు అని ఇంకొకరు మండిపడ్డారు. బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై హీరోలు, అభిమానులు కౌంటర్లు ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ పీరియాడిక్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేదో చూడాలి.
