వడ్లు కొనకుంటే రైతుల బతుకేంటా..?వాళ్లు లేకుంటే మీ బతుకేంటో..?

వడ్లు కొనకుంటే రైతుల బతుకేంటా..?వాళ్లు లేకుంటే మీ బతుకేంటో..?

హైదరాబాద్, వెలుగుసీఎం కేసీఆర్ చేతగాని తనం వల్లే రైతుల బతుకులు ఆగమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే ఐకేపీ సెంటర్లకు వెళ్లి రైతుల బాధలు తెలుసుకోవాలని సవాల్ చేశారు. ‘‘ధాన్యాన్ని తమ ప్రభుత్వం సేకరించకుండా ఉంటే మీ బతుకులేంటని రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నారు. రైతులు లేకుంటే సీఎం బతుకేంటో తెలుస్తుంది. తమ చెమట చుక్కలతో రైతులు పండించిన పంటలను వారి చేతులతో కాలపెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో సీఎం ఒక్కసారి ఆలోచన చేయాలి’’ అని చెప్పారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం కొనుగోలుదారులపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు.

75 లక్షల టన్నులు కొనేదెప్పుడు?

రాష్ర్టంలో రైతుల నుంచి కోటి టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు 25 లక్షల టన్నులే సేకరించారని బండి సంజయ్ ఆరోపించారు. గడువు ముగిసేందుకు కేవలం పది రోజుల సమయం ఉందని, మిగతా 75 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎప్పటిలోగా సేకరిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ కోటి టన్నుల ధాన్యం సేకరణ అనేది ఒక్క యాసంగికా…? లేక యాసంగి, వానా కాలం కలిపా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు, కాంటా పేరుతో రెండు కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు.

పత్తి, కందులు కేంద్రమే కొన్నది

రాష్ట్రంలోని పత్తిని సీసీఎస్ ద్వారా, లక్షా 50 వేల టన్నుల కందులను నాఫెడ్ ద్వారా కేంద్రమే కొనుగోలు చేసిందని సంజయ్ అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులెన్ని? ఏ పథకాల కింద ఎంత ఇచ్చింది? వాటిలో రాష్ట్రం దేనికోసం ఎంత ఖర్చు చేసిందో వెంటనే వైట్​పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఖర్చు చేసిందేమిటో చెప్పాలన్నారు. కేంద్రం చేసిన ప్రతి పనిని తానే చేసినట్లుగా కేసీఆర్ చెప్పుకుంటారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా సహాయ నిధి పేరుతో వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి బెదిరించి, వారి నుంచి కోట్లు తీసుకుంటున్న సీఎం, వాటి లెక్కలను కూడ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

టెస్టులపై కుంటిసాకులు చెప్తుండు

లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిని కట్టడి చేసే దమ్ము ఈ సీఎంకు లేదని సంజయ్ అన్నారు. మర్కజ్ వెళ్లివచ్చిన వారితోనే కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. పక్క రాష్ట్రంలో లక్షకు పైగా కరోనా టెస్టులు చేస్తే.. ఇక్కడ టెస్టులే చేయడం లేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే డబ్ల్యూహెచ్ వో, ఐసీఎంఆర్ రూల్స్ అంటూ కుంటిసాకులు చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టంలో కరోనా కేసులపై కేంద్రం, రాష్ట్రం విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లలో తేడాలుంటున్నాయని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రిని చూసి కరోనా పారిపోతుందని, రేపు అమెరికాలో కూడా కరోనాను పారదోలేందుకు ట్రంప్.. కేసీఆర్ ను పిలుస్తాడేమోనని ఎద్దేవా చేశారు.

ఒక వర్గానికి కొమ్ముకాస్తుండు

రాష్ట్రంలో ఒక వర్గానికి కొమ్ముకాసే రీతిలో సీఎం కేసీఆర్ వ్యవహారిస్తున్నారని, ఆ వర్గాన్ని పెంచి పోషించడం వల్ల సమాజంలో చీలికలు వచ్చే ప్రమాదం ఉందని సంజయ్ అన్నారు. పాతబస్తీలో దళిత బాలికపై అత్యాచారం చేసిన మజ్లిస్ గుండాపై నిర్భయ చట్టం కింద చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపిస్టులకు, అంతర్ రాష్ట్ర దొంగల ముఠాకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. దీనికి మజ్లిస్ పార్టీయే కారణమని ఆరోపించారు.