
- షకీబల్ హసన్ ఆల్ రౌండ్ షో
లో స్కోరింగ్ మ్యాచ్‌లతో .. వన్‌సైడ్ విక్టరీలతో.. చప్పగా సాగుతున్న వరల్డ్‌కప్‌కు ఊపొచ్చింది. మెగా టోర్నీ తొలి వారంలోనే అతి పెద్ద సంచలనం నమోదైంది. పేరుకు చిన్న జట్టే అయినా తమను లైట్ తీసుకుంటే ఎంత ప్రమాదమో బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌లోనే నిరూపించింది..! ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లా టైగర్లు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన సౌతాఫ్రికాను ఓడించి అదరహో అనిపించారు..!
రబాడ, ఎంగిడి, ఫెహుల్‌క్వాయో, మోరిస్, తాహిర్ అందరూ వరల్డ్‌క్లాస్ బౌలర్లే! వీరితో మెగా టోర్నీలోనే అత్యంత పవర్‌ఫుల్ బౌలింగ్ విభాగం సఫారీలదే..! కానీ, అలాంటి జట్టునే బంగ్లా ఓ ఆటాడుకుంది..! వెటరన్ ప్లేయర్లు షకీబల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిపోయారు. మేమేం తక్కువా అన్నట్టు సౌమ్య సర్కార్, మహ్మదుల్లా మెరుపులు మెరిపించారు.! దాంతో, వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసిన బంగ్లా.. తిరుగులేని బౌలింగ్‌తో దాన్ని కాపాడుకొని మెగా టోర్నీలో అద్భుత బోణీ కొట్టింది. మిగతా జట్లకూ హెచ్చరికలు పంపింది..!
పాపం సౌతాఫ్రికా. ఆ జట్టుకు మళ్లీ భంగపాటే. ఓపెనింగ్ మ్యాచ్‌లో నంబర్ వన్ టీమ్ ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టుకు ఏడో ర్యాంకర్ బంగ్లా చేతిలోనూ ఏడుపే మిగిలింది బంతితో ప్రత్యర్థిని అడ్డుకోలేక.. బ్యాట్‌తో టార్గెట్‌ను అందుకోలేక వరుసగా రెండో ఓటమితో చతికిల పడింది..!
లండన్ : వరల్డ్‌కప్‌లో పెద్ద జట్లకు షాకిచ్చే అలవాటును కొనసాగించిన బంగ్లాదేశ్ ఈసారి సౌతాఫ్రికాను దెబ్బకొట్టింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టి విజయంతో మెగా టోర్నీని స్టార్ట్ చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్(80 బంతుల్లో 8 ఫోర్లతో 78), షకీబల్ హసన్(84 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 75) హాఫ్ సెంచరీలు చేయగా, మహ్మదుల్లా(33 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌తో 46 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించాడు. ఛేజింగ్‌లో 50 ఓవర్లలో సౌతాఫ్రికా 8 వికెట్లకు 309 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. డుప్లెసిస్ (53 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 62) , మార్‌క్రమ్(45), డుమిని(45), డుసేన్(41) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ (3/67) మూడు , సైఫుద్దీన్(2/57) రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబల్ హసన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ప్రొటీస్ స్పీడ్ సరిపోలా..
భారీ ఛేజింగ్‌లో సౌతాఫ్రికాకు కూడా మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(23), మార్‌క్రమ్(45) తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. కానీ, మార్‌క్రమ్‌తో సమన్వయ లోపంతో లేని పరుగుకు యత్నించిన డికాక్ రనౌటవడంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మార్‌క్రమ్‌తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే సౌతాఫ్రికా విజయం ఖాయమే అనిపించింది. కానీ, హాఫ్ సెంచరీకి చేరువైన మార్‌క్రమ్‌ను 20వ ఓవర్లో బౌల్డ్ చేసి షకీబల్ బంగ్లాను మ్యాచ్‌లోకి తెచ్చాడు. అయినా జోరు కొనసాగించిన డుప్లెసిస్.. మొసదేక్ హుస్సేన్ వేసిన 25వ ఓవర్‌లో భారీ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, కొద్దిసేపటికే డుప్లెసిస్‌ను బౌల్డ్ చేసిన మిరాజ్ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ దశలో బాధ్యత తీసుకున్న సీనియర్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్, డుసేన్ 34.2 ఓవర్లలో జట్టు స్కోరును 200కు చేర్చి సఫారీలను రేసులోకి తెచ్చారు. కానీ, బంగ్లా బౌలర్లు పోరాటం ఆపలేదు. జోరుమీదున్న మిల్లర్‌ను ఔట్ చేసిన ముస్తాఫిజుర్ ఈ జోడీని విడదీశాడు. ఈ దశలో జేపీ డుమినితో కలిసి డుసేన్ ధాటిగా ఆడాడు. ముస్తాఫిజుర్ వేసిన 38వ ఓవర్‌లో 6, 4 కొట్టి ఊపులోకొచ్చాడు. కానీ, 40 ఓవర్లో అతడిని సైఫుద్దీన్ బౌల్డ్ చేయడంతో ప్రొటీస్ టీమ్ ఓటమి ఖాయమైంది. డుమిని క్రీజులో ఉన్నా అతనికి సహకారం కరువైంది. సాధించాల్సిన రన్‌రేట్ అమాంతం పెరిగిపోయిన టైమ్‌లో ఫెహుల్‌క్వాయో(8), మోరిస్(10) నిరాశ పరిచారు. సైఫుద్దీన్ వేసిన 47వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన డుమినిని బౌల్డ్ చేసిన ముస్తాఫిజుర్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
షకీబల్-ముష్ఫికర్ భారీ పార్ట్‌నర్‌షిప్
ఫ్లాట్ వికెట్‌పై బంగ్లా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. ముష్ఫికర్, షకీబల్ కీలక ఇన్నింగ్స్‌లకు తోడు ఆరంభంలో సౌమ్య సర్కార్, చివర్లో మహ్మదుల్లా మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థి ముందు బంగ్లాదేశ్ భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(16), సౌమ్య సర్కార్( 30 బంతుల్లో 9 ఫోర్లతో 42) మెరుపు ఆరంభం ఇచ్చారు. తమీమ్ నెమ్మదిగా ఆడినా సౌమ్య మాత్రం భారీ షాట్లతో చెలరేగాడు. ముఖ్యంగా ఎంగిడిని లక్ష్యంగా చేసుకున్న సౌమ్య సర్కార్ అతని బౌలింగ్‌లో వరుసపెట్టి బౌండ్రీలు బాదేశాడు. ఏడో ఓవర్ వేసిన తర్వాత తొడ కండరాలు పట్టేయంతో ఎంగిడి మైదానం వీడి మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. దీన్ని సద్వినియోగం చేసుకున్న తమీమ్-–సౌమ్య జోడి తొలి వికెట్‌కు 50 బంతుల్లోనే 60 రన్స్ జోడించింది. అయితే తొమ్మిదో ఓవర్లో మంచి డెలివరీతో తమీమ్‌ను ఔట్ చేసిన ఫెహుల్‌క్వాయో ఈ జోడీని విడదీశాడు. హాఫ్ సెంచరీకి చేరువైన సర్కార్‌ను కాసేపటికే మోరిస్ వెనక్కుపంపి సౌతాఫ్రికా శిబిరంలో జోష్ నింపాడు. కానీ, ఈ ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. సీనియర్ క్రికెటర్లు షకీబల్, ముష్ఫికర్ రహీమ్ అనూహ్యంగా విజృంభించారు. సింగిల్స్ డబుల్స్ తీస్తూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. క్రీజులో కుదురుకున్నా పదునైన షాట్లతో బౌండ్రీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మోరిస్ బౌలింగ్‌లో పుల్‌షాట్‌తో షకీబల్ చూడచక్కటి సిక్సర్ కొట్టాడు. మరో ఎండ్‌లో రహీమ్ కూడా బౌండ్రీలతో అలరించాడు. వీరిద్దరినీ విడదీయడానికి తాహిర్‌తో పాటు పార్ట్‌టైమర్లు మార్‌క్రమ్, డుమిని బౌలింగ్‌కు వచ్చినా ఫలితం లేకపోయింది. అదే జోరుతో బ్యాటింగ్ చేసిన షకీబల్, ముష్ఫికర్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 32 ఓవర్లోనే జట్టు స్కోరు 200 మార్కు దాటించారు.