రెండు పడవలు ఢీ.. 25 మందికిపైగా మృతి

రెండు పడవలు ఢీ.. 25 మందికిపైగా మృతి
  • బంగ్లాదేశ్ శిబిచార్ పట్టణం వద్ద పద్మ నదిలో ఘటన

ఢాకా : శిబిచార్ పట్టణ సమీపంలో పద్మ నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవను ఇసుక రవాణా చేస్తున్న పడవ ఢీకొట్టడంతో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో ఐదుగురిని రక్షించామని శిబిచార్ పట్టణ పోలీసు అధికారి మిరాజ్ హుస్సేన్ తెలిపారు. మరికొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, విపత్తు నివారణ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి పలువురిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా కొందరు గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. ఎంత మంది పడవలో ప్రయాణిస్తున్నారు.. ఎంత మంది గల్లంతయ్యారనేది కచ్చితమైన సమాచారం లేదు. దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని.. ప్రమాదంలో బయటపడిన వారిచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నామని అధికారులు ప్రకటించారు. బంగ్లాదేశ్ లో ఇటీవల పడవ ప్రమాదాలు జరగడం సర్వ సాధారణంగా మారింది. షిప్‌యార్డుల వద్ద భద్రతా ప్రమాణాల గురించి పట్టించుకోకపోవడం, రద్దీని పడవలు తట్టుకుంటాయా లేదా అనేది గమనించకపోవడం పరిపాటిగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏప్రిల్‌ నెలలోనూ 50 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవను పెద్ద కార్గో ఓడ ఢీకొట్టిన ఘటన మరువకముందే ఇవాళ మరో ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.