BAN vs IRE: బంగ్లాదేశ్ నుంచి ఇది ఊహించనిది.. ఐర్లాండ్‌పై 338 పరుగులకు ఒకటే వికెట్

BAN vs IRE: బంగ్లాదేశ్ నుంచి ఇది ఊహించనిది.. ఐర్లాండ్‌పై 338 పరుగులకు ఒకటే వికెట్

ఐర్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ దుమ్ములేపుతుంది. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో అద్భుతంగా రాణించి ఐర్లాండ్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేసిన బంగ్లా.. ఆ తర్వాత బ్యాటింగ్ లో అసాధారణంగా ఆడుతుంది. తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా పూర్తి ఆధిపత్యం చూపించింది. రెండో రోజు ఆట ముగి సేసమయానికి వికెట్ నష్టానికి 338 పరుగులు చేయడం విశేషం. ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 169 పరుగులతో అజేయంగా నిలిస్తే.. షాద్మాన్ ఇస్లాం 80 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన మోమినుల్ హక్ 80 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉండడంతో భారీ ఆధిక్యం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 92.2 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. స్టిర్లింగ్ (60), కేడ్ కార్మైకేల్ (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. కర్టిస్ కాంఫర్ (44), లోర్కాన్ టక్కర్ (41), జోర్డాన్ నీల్ (30), బారీ మెక్కార్తీ (31) పర్వాలేదనిపించారు. ఒకదశలో వికెట్ నష్టానికి 96 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఐర్లాండ్.. ఒక్కసారిగా కుప్పకూలింది. మెహిదీ హసన్ మీరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ మురాద్, తైజుల్ ఇస్లాం, హసన్ మహ్మద్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. నహిద్ రాణాకు ఒక వికెట్ దక్కింది. 

తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. మహ్మదుల్ హసన్ జాయ్, షాద్మాన్ ఇస్లాం ఐరీష్ బౌలర్లను అలవోకగా ఆడేశారు. తొలి వికెట్ కు ఏకంగా 168 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశారు. 80 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న షాద్మాన్ ఇస్లాంను మాథ్యూ హంఫ్రీస్ ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మోమినుల్ హక్ తో కలిసి హసన్ జాయ్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో తన సెంచరీని పూర్తి చేసుకొని 150 పరుగుల మార్క్ కూడా చేరుకున్నాడు. మరో ఎండ్ లో మోమినుల్ సైతం 80 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు.