బంగ్లాదేశ్ లో మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి

బంగ్లాదేశ్ లో మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు పలు దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. గుంపులు,గుంపులుగా నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా అనుమతించడం లేదు. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లోనూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే.. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రస్తుతం నడుస్తుండటంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు వచ్చే వారికి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. చిన్న పిల్లలను, వృద్ధులను, జ్వరంతో బాధ పడుతున్న వారిని మసీదుల్లోకి తీసుకురాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అంతేకాదు… మసీదుల్లో శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రార్థనలకోసం వచ్చే వారు ఎవరి మ్యాట్ ను వారే తెచ్చుకోవాలని చెప్పింది. భౌతికదూరం పాటించాలని, మసీదుల పరిసరాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించవద్దని ఆదేశించింది. మత సంస్థల నుంచి ఒత్తిళ్లు రావడంతోనే మసీదులు తెరవాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది.