AFG vs BAN: బంగ్లాదేశ్‌ చేతిలో క్లీన్ స్వీప్.. వరుస పరాజయాలతో ఢీలా పడుతున్న ఆఫ్ఘనిస్తాన్

AFG vs BAN: బంగ్లాదేశ్‌ చేతిలో క్లీన్ స్వీప్.. వరుస పరాజయాలతో ఢీలా పడుతున్న ఆఫ్ఘనిస్తాన్

వరల్డ్ కప్ 2024 సెమీ ఫైనల్స్ కు చేరుకొని క్రికెట్ లో సంచలంగా మారిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రస్తుతం వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో కనీసం సూపర్ -4 కు అర్హత సాధించడంలో విఫలమైన ఆఫ్ఘన్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ పై సొంతగడ్డపై మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అయింది. తొలి రెండు టీ20 లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆదివారం (అక్టోబర్ 5) జరిగిన మూడో టీ20లోనూ పరాజయం తప్పలేదు. ఈ ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ 0-3 తో బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయింది. 

షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసింది. దర్విష్ రసూలి 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెదికుల్లా అటల్ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఒకదశలో 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆఫ్ఘన్ జట్టును చివర్లో ముజీబ్ ఆదుకున్నాడు. 18 బంతుల్లో 23 పరుగులు చేసి బంగ్లా ముందు ఫైటింగ్ టోటల్ ఉంచాడు. బంగ్లా బౌలర్లలో మొహమ్మద్ సైఫుద్దీన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. తంజిమ్ హసన్ సాకిబ్, నసుమ్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది. సైఫ్ హసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాగేసుకున్నాడు. 38 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 64 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ 33 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. సైఫ్ హసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. నసుమ్ అహ్మద్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది.