ఎఫ్‌‌‌‌డీలపై వడ్డీ పెంచుతున్న బ్యాంకులు

 ఎఫ్‌‌‌‌డీలపై వడ్డీ పెంచుతున్న బ్యాంకులు
  • 50 బేసిస్ పాయింట్లు పెంచిన పీఎన్‌‌‌‌బీ
  • ఎస్‌‌‌‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌ల ఎఫ్‌‌‌‌డీలపైనా పెరిగిన వడ్డీ

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌‌‌ (పీఎన్‌‌‌‌బీ)  రూ . 2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్ల (ఎఫ్‌‌డీ)పై వడ్డీని పెంచింది.  కొన్ని  టెన్యూర్​లపై  50 బేసిస్ పాయింట్ల వరకు పెంచగా, మరికొన్ని టెన్యూర్‌‌‌‌‌‌‌‌లపై తగ్గించింది. సవరించిన రేట్లు  జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి.  180 నుంచి 270 రోజుల కాల పరిమితి గల ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లపై వడ్డీని  50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇక నుంచి కస్టమర్లు  6 శాతం వరకు వడ్డీని పొందొచ్చని  పేర్కొంది.   అలానే 271 రోజుల నుంచి ఏడాది లోపు కాల పరిమితి గల ఎఫ్‌‌‌‌డీలపై వడ్డీని 45 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఎఫ్‌‌‌‌డీతో 7.25 శాతం వడ్డీ పొందొచ్చు. 400 రోజుల  టెన్యూర్‌‌‌‌‌‌‌‌ గల ఎఫ్‌‌‌‌డీల వడ్డీని  6.80 శాతం నుంచి 7.25 శాతానికి  పెంచింది. 444 రోజుల కాల పరిమితి గల ఎఫ్‌‌‌‌డీలపై వడ్డీని 45 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.80 శాతంగా నిర్ణయించింది.  ఏడు నుంచి 10 ఏళ్ల కాల పరిమితి గల వివిధ ఎఫ్‌‌‌‌డీలపై  3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.  పీఎన్‌‌‌‌బీ సీనియర్  సిటిజెన్లకు ఎఫ్‌‌‌‌డీల వడ్డీని 4 శాతం నుంచి 7.75 శాతం వరకు అందిస్తోంది. సూపర్ సీనియర్స్ (80 ఏళ్లు కంటే పైన ఉన్నవారు) కు 4.3 శాతం నుంచి 8.05 శాతం వరకు ఆఫర్ చేస్తోంది.

మిగిలిన బ్యాంకులు అదే బాటలో..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌బీఐ)  కూడా రూ.2 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌‌‌‌డీలపై వడ్డీని పెంచింది. ప్రస్తుతం ఏడు నుంచి 10 ఏళ్ల టైమ్ పీరియడ్‌‌‌‌ గల ఎఫ్‌‌‌‌డీ స్కీమ్‌‌‌‌లపై 3.5 శాతం నుంచి 7 శాతం వరకు  వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌‌‌‌డీలపై వడ్డీని 125 బేసిస్  పాయింట్లు పెంచింది. రూ.2 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌‌‌‌డీలపై 4.25 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.75 శాతం వరకు ఇస్తోంది. ఏడు నుంచి 10 ఏళ్ల కాల పరిమితి గల ఎఫ్‌‌‌‌డీలపై ఈ వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌  ఏడాది నుంచి 15 నెలల ఎఫ్‌‌‌‌డీలపై 6.6 శాతం వడ్డీని, 15 –18 నెలల ఎఫ్‌‌‌‌డీలపై 7.10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 18–21 నెలల ఎఫ్‌‌‌‌డీలపై 7 శాతం ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా వివిధ టెన్యూర్‌‌‌‌‌‌‌‌ల ఎఫ్‌‌‌‌డీలపై 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.