January Bank Holidays: బ్యాంకులో పనుల కోసం వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే జనవరి నెలాఖరులో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రోజులు సెలవులు ఖరారు కాగా.. నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వటంతో లాంగ్ బ్యాంక్ హాలిడేస్ ఉండనున్నాయి.
జనవరి 24న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం సెలవు. ఆ తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలిడే. అంటే ఈ మూడు రోజులు ఎలాగూ బ్యాంకులు పని చేయవు. అయితే.. తమ చిరకాల డిమాండ్ అయిన వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ కోసం జనవరి 27న సమ్మె చేయాలని బ్యాంకు సంఘాలు నిర్ణయించాయి. ఒకవేళ ఈ సమ్మె జరిగితే.. వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు దేశవ్యాప్తంగా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేతృత్వంలో బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులే పనివేళలు కావాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు, టార్గెట్ల వల్ల ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని, వారానికి రెండు రోజులు విశ్రాంతి అవసరమని వారు కోరుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మధ్య సమతుల్యత కోసం ఈ మార్పు అవసరమని యూనియన్లు వాదిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎల్ఐసీ , రిజర్వ్ బ్యాంక్, స్టాక్ మార్కెట్లు వారానికి 5 రోజులే పనిచేస్తున్నాయి. అటువంటప్పుడు బ్యాంకులకు కూడా అదే రూల్ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వారానికి రెండు రోజులు సెలవు ఇస్తే కస్టమర్లకు ఇబ్బంది కలుగుతుందనే వాదనకు యూనియన్లు ఒక పరిష్కారాన్ని చూపాయి. పని దినాలు తగ్గించినా.. పని గంటలను పెంచాలని వారు ప్రతిపాదించారు. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాల పాటు పని చేస్తామని.. దీనివల్ల కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగదని యూనియన్లు హామీ ఇస్తున్నాయి.
బ్యాంకు సమ్మె అనేది కేవలం సెలవుల కోసం మాత్రమే కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు కావాలనేది ఉద్యోగుల ఆవేదన. అయితే దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం, ఆర్‌బీఐ. జనవరి 27 సమ్మెకు ముందే ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపితే వినియోగదారులకు ఊరట లభిస్తుంది. లేదంటే జనవరి చివరి వారంలో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
