సొంత ఖర్చులకు లోన్​ డబ్బు వాడుకున్న బ్యాంక్​ మేనేజర్​ 

సొంత ఖర్చులకు లోన్​ డబ్బు వాడుకున్న బ్యాంక్​ మేనేజర్​ 
  • కారు గుంజుకున్న రైతు

వంగూరు (నాగర్​కర్నూల్), వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లాలో క్రాప్​లోన్ ​కింద కట్టిన డబ్బును ఐఓబీ (ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్)​ బ్రాంచ్ మేనేజర్​ సొంత ఖర్చులకు వాడుకున్నాడని ఓ రైతు మేనేజర్​ కారుని గుంజుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. క్రాప్ లోన్లకు ఓటీఎస్ (వన్​టైం సెటిల్​మెంట్) అవకాశం లేకున్నా, వంగూరు మండల కేంద్రంలోని ఐఓబీ మేనేజర్​ భాస్కర్​రెడ్డి ఉన్నట్లు ఇటీవల ప్రకటించాడు. ఓటీఎస్​ కింద డిండిచింతపల్లికి చెందిన కార్తీక్​రెడ్డి రూ.లక్ష5వేలు కట్టగా, అతని అకౌంట్​లో రూ.80 వేలు జమచేసి రూ.25వేలును మేనేజర్​ భాస్కర్​ సొంతానికి వాడుకున్నాడు. రిసిప్ట్ ఇవ్వమని అడగగా రేపు ఎల్లుండి అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఇలా ఉల్పరకి చెందిన శ్రీశైలం రూ.2లక్షల70వేలు కట్టగా రూ.2.10లక్షలు జమ చేసి రూ.60వేలు, రాంరెడ్డి అనే రైతుతో రూ.లక్ష కట్టించి అకౌంట్​లో రూ. 25వేలు మాత్రమే జమ చేసి మిగిలిన మొత్తాన్ని వాడుకున్నాడు.

సర్వారెడ్డిపల్లికి చెందిన రైతు మబ్బు శ్రీను రూ.95 వేలు కట్టగా రూ.40వేలు మాత్రమే జమ చేశాడు. ఇలా దాదాపు 16 మంది రైతులతో డబ్బులు కట్టించినట్లు తెలుస్తోంది. మేనేజర్ వ్యవహారంపై అనుమానం వచ్చిన రైతుల్లో ఒకరు హెడ్ ఆఫీసుకు ఫిర్యాదు చేశారు. గత సోమవారం బ్యాంక్చీ ఫ్ జనరల్​ మేనేజర్ నాగరాజు ఎంక్వైరీకి రాగా మేనేజర్ భాస్కర్ రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని బ్యాంక్​లోనే పడిపోయాడు. ట్రీట్​మెంట్​ కోసం వెంటనే కల్వకుర్తికి, అటు నుంచి హైదరాబాద్​కు వెళ్లినట్లు సమాచారం. తాను రూ.60వేలు మోసపోయానని తెలుసుకున్న శ్రీశైలం అనే రైతు శుక్రవారం బ్యాంక్​ మేనేజర్​ భాస్కర్​ కారు ఎత్తుకుపోయాడు. డబ్బు కట్టి విడిపించుకోవాలని చెప్పినట్లు తెలిసింది. వంగూరు బ్రాంచ్ లో జరిగిన వ్యవహారంపై విచారణ చేస్తున్నామని, నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని చీఫ్​ జనరల్​ మేనేజర్ ​నాగరాజు చెప్పారు.