లక్నో: సహజీవనం చేస్తోన్న మహిళను ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.. గొడ్డలితో తల నరికి ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు.. అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. చివరి నిమిషంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది. సినిమాను తలపించే ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఉమా (30) అనే మహిళకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆమె ఒక కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో రెండేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని కుమారుడితో కలిసి వేరే ఉంటుంది. ఈ క్రమంలోనే బిలాల్ అనే టాక్సీ డ్రైవర్‌తో ఆమె పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏడాది నుంచి బిలాల్, ఉమా సహ జీవనం చేస్తున్నారు. బిలాల్‌కు వివాహం కాకపోవడంతో అతడికి ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. దీంతో వేరే యువతిని వివాహం చేసుకునేందుకు ఉమాతో బంధాన్ని తెంచుకోవాలని బిలాల్ నిర్ణయించుకున్నాడు.
ఉమా ఇందుకు అంగీకరించకపోవడంతో ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఇందులో 2025, డిసెంబర్ 6 సాయంత్రం ఉమాను సహారన్పూర్ నుంచి స్విఫ్ట్ కారులో తీసుకువెళ్లి దాదాపు ఆరు గంటలు తిరిగాడు. తరువాత ఆమెను కాలేసర్ అడవికి దగ్గరగా ఉన్న లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉమాను హత్య చేశాడు. ఆమె తలను నరికి మొండాన్ని అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయాడు. ఇంటికి వెళ్లి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఉమా కనబడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టి బిలాలే ప్రియురాలిని హత్య చేసినట్లు గుర్తించారు. వెంటనే బిలాల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. బిలాల్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో ఉమా తల లేని మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో స్త్రీని వివాహం చేసుకోవడానికి ఉమాతో సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడని ఇందులో భాగంగానే ఆమెను హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఉమా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిలాల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
