బ్యాంకుల ప్రైవేటైజేషన్ బిల్​ విత్ డ్రా చెయ్యాలే

బ్యాంకుల ప్రైవేటైజేషన్ బిల్​ విత్ డ్రా చెయ్యాలే

బంజారాహిల్స్, వెలుగు:  ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటైజేషన్​ బిల్లును ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మె చేపడుతామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16,17 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నట్టు అయన చెప్పారు. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో  సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే  రైతు ఉద్యమ స్ఫూర్తితో అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. బ్యాంకులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని, ఎగవేతదారులను ఎందుకు జైల్లో పెట్టలేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును కొందరు లీగల్​గా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీలు సుజనాచౌదరి, లగడపాటి రాజగోపాల్ లాంటి వారు కూడా బ్యాంకులకు డబ్బులు చెల్లించాల్సిఉన్నదన్నారు.. మొత్తం 13 మంది బ్యాంక్ ఖాతాదారులు రూ.4,46,800 కోట్లు బకాయి పడగా..  రూ. 1,61,820 కోట్లు సెటిల్ చేసుకున్నారని, మిగిలిన రూ. 2,84,980 కోట్లు బ్యాంకులు నష్టపోయాయన్నారు. ఇలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకులలో కార్పొరేట్ సంస్థలే  డిఫాల్టర్లుగా ఉంటున్నాయని వివరించారు. బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే చార్జీలు, వడ్డీలు పెరుగుతాయని, సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐబీఓఏ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్,  కార్యదర్శి హర్ నాథ్, బ్యాంక్​ ఎంప్లాయిస్​ లీడర్లు మోహన్, పి.వి.కృష్ణారావు, ఫణికుమార్, చంద్రశేఖర్,  ఉదయ్,  సమద్ ఖాన్,  జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు