లోన్లను రెన్యువల్​ చేసేందుకు బ్యాంకర్ల ప్రయత్నాలు

లోన్లను రెన్యువల్​ చేసేందుకు బ్యాంకర్ల ప్రయత్నాలు

రెన్యువల్ ​చేస్తలేరని రైతు భార్యల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్న బ్యాంకర్లు​

మహబూబ్​నగర్, వెలుగు : రైతులు పంటల కోసం తీసుకున్న లోన్లను రెన్యువల్​ చేసేందుకు బ్యాంకర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ‘రైతుబంధు’ డబ్బులను జమ చేసుకున్న ఆఫీసర్లు.. తాజాగా రైతుల భార్యలకు మహిళా సంఘాల ద్వారా శాంక్షన్​ చేస్తున్న డబ్బులను కట్​ చేస్తున్నారు. ఈ మేరకు వారి అకౌంట్లను ఫ్రీజ్​ చేసి, వడ్డీ పైసలు కట్టించుకొని లోన్లను రెన్యువల్​ చేస్తున్నారు.  మహబూబ్​నగర్​ జిల్లాలో ఒక జిల్లా మహిళా సమాఖ్య, 15 మండలFi సమాఖ్యలు, 475 గ్రామ సంఘాలు, 11,322 స్వయం సహాయక సంఘాలుండగా.. 1,27,502 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మార్చితో ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుండడంతో జిల్లాలోని కొన్ని బ్యాంకుల ద్వారా పది రోజుల నుంచి సంఘాల సభ్యులకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు లోన్లు ఇస్తున్నారు. వీరికి లోన్లు మంజూరు చేసేముందు బ్యాంకర్లు మహిళా సంఘాల్లో విలేజ్​ఆర్గనైజేషన్​ అసిస్టెంట్(వీవోఏ)లుగా పని చేసేవారిని ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా సంఘాల్లోని మహిళల భర్తల ఆధార్, పాన్​కార్డులను సేకరిస్తున్నారు.  ఈ వివరాల ఆధారంగా ఆయా బ్యాంకుల అకౌంట్లను చెక్​ చేస్తున్నారు. వారిలో రైతులు ఎవరెవరున్నారనేది తెలుసుకుంటున్నారు. అనంతరం మహిళలకు లోన్​ మంజూరు చేస్తున్నారు. కానీ అకౌంట్​ నుంచి డబ్బులు డ్రా చేయనివ్వకుండా ఫ్రీజ్​ చేస్తున్నారు. ఈ విషయంపై రెండు, మూడు రోజుల తర్వాత మహిళలు బ్యాంకుల వద్దకు వెళితే.. ‘మీ భర్త గతంలో క్రాప్​ లోన్​ తీసుకున్నాడు. ఏండ్లు అవుతున్నా రెన్యువల్ చేయట్లేదు. అందుకే మీకు మంజూరు చేసిన లోన్​ నుంచి మీ భర్త లోన్​ను రెన్యువల్​ చేస్తున్నాం’ అని చెబుతున్నారు. రెన్యువల్​ కోసం చేసింది పోగా మిగతా పైసలు మహిళలకు ఇస్తున్నారు.

రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు కట్​

సర్కారు హామీ ఇచ్చేనాటికి రాష్ట్రంలో లక్ష వరకు క్రాప్​ లోన్లు తీసుకున్న రైతులు 36.68 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉండగా, రాష్ట్ర సర్కారు  ఇప్పటివరకు రూ. 37 వేల లోపు రుణాలున్న 5.66 లక్షల మంది రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే మాఫీ చేసింది.  మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లోన్లు తీసుకొని ఐదారేండ్లు కావస్తుండటంతో వడ్డీ కూడా రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు పెరిగిపోయింది. దీంతో ఆఫీసర్లు రైతులు లోన్లు తీసుకున్న అకౌంట్లను ఫ్రీజ్​ చేస్తున్నారు. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పైసలను వాడుకోనివ్వకుండా రెన్యువల్​ కోసం మినహాయించుకున్న బ్యాంకర్లు తాజాగా మహిళా సంఘాల్లో ఉండే రైతుల భార్యలకు శాంక్షన్​ చేస్తున్న లోన్ల నుంచి కూడా డబ్బులు కట్​ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

పెరుగుతున్న వడ్డీ భారం

ఐదారేండ్ల నుంచి రైతులు లోన్లను రెన్యువల్​ చేసుకోకపోవడంతో వడ్డీ భారం పెరుగుతోంది. ప్రతి ఆరు నెలలకోసారి, లేదంటే ఏడాదికి ఒకసారి క్రాప్​ లోన్లను రెన్యువల్​ చేసుకోవాలి. అలా చేస్తే33 పైసల వడ్డీ పడుతుంది. అదే ఒక్కరోజు ఆలస్యంగా రెన్యువల్​ చేసినా ఏడు శాతం వడ్డీ రేటు అంటే 66 పైసలు వడ్డీ పడుతుంది. ఐదారేండ్లు దాటిన మొండి బకాయిలు అయితే  ఏటా 14 శాతం నుంచి 15 శాతం వడ్డీ వేస్తారు. ఈ లోన్లపై రూపాయి నుంచి రూపాయిన్నర వరకు వడ్డీ లెక్కిస్తుండడంతో రైతులపై భారం పెరిగిపోతోంది. అలాగే సిబిల్​స్కోరుపైనా ప్రభావం పడుతోంది. 

రెన్యువల్​ చేసుకోవాలి

మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేస్తున్న లోన్లను రైతులు తీసుకున్న క్రాప్​ లోన్ల కింద రెన్యువల్​ చేయాలని ఏ ఆఫీసర్​కు ఆదేశాలు ఇవ్వలేదు. బలవంతంగా డబ్బులు కట్టించుకోవాలని కూడా ఎవరికీ చెప్పలేదు. రైతులు తీసుకున్న క్రాప్​ లోన్లను ఏటా రెన్యువల్​ చేసుకోవాలి. రెన్యువల్​ చేసుకోకుంటే వడ్డీ పెరిగిపోతుంది. దాంతో రైతుపై భారం పడుతుంది. ఈ విషయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ విషయం గురించి చెబుతున్నాం.

- శ్రీనివాసులు, లీడ్ బ్యాంక్​ మేనేజర్, మహబూబ్​నగర్​

మొండి బకాయిల వసూలు

లోన్​ భర్త తీసుకున్నా.. భార్యకు కూడా సంబంధం ఉంటుంది. బ్యాంకర్లు మహిళా సంఘాల సభ్యుల భర్తల ఆధార్, అకౌంట్​బుక్​లను తీసుకొని బకాయిలను చెక్​ చేస్తున్నారు. క్రాప్​లోన్లలో మొండి బకాయిలు ఉంటే, వాటికి సంబంధించిన వడ్డీని సభ్యులకు శాంక్షన్​ చేస్తున్న లోన్ల నుంచి కట్టించుకుంటున్నారు.

- రాందాస్​నాయక్​, అసిస్టెంట్​ ప్రాజెక్ట్​మేనేజర్, చిన్నచింతకుంట మండలం