బ్యాంక్​ అప్పులపై వడ్డీల మోత

బ్యాంక్​ అప్పులపై వడ్డీల మోత


న్యూఢిల్లీ:కస్టమర్లకు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లను రాబోయే రెండు క్వార్టర్లలో 25–50 బేసిస్​ పాయింట్ల వరకు పెంచుతామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇందుకోసం ఇవి తమ ‘మార్జిన్​ కాస్ట్​ ఆఫ్​ ఫండ్స్​– బేస్డ్‌​ లెండింగ్​ రేట్’ (ఎంసీఎల్​ఆర్) ను పెంచుతున్నాయి. దీనివల్ల  కార్పొరేట్,  రిటైల్ బారోవర్లు ఇక నుంచి అప్పులపై ఎక్కువ వడ్డీ రేటును చెల్లించాల్సి రావచ్చు. అన్ని రేట్లూ పెరుగుతున్నాయని, చవక వడ్డీ రేట్ల కాలం ముగిసినట్టేనని ఎనలిస్టులు అంటున్నారు.  ఒక పర్సంటేజ్​ పాయింట్​లో నూరవవంతును బేసిస్​ పాయింట్ అంటారు. లోన్లపై కనీస వడ్డీ రేటును ఎంసీఎల్​ఆర్​ అంటారు.  ఇంతకంటే తక్కువ వడ్డీ రేటుకి అప్పులు ఇవ్వవు.  బ్యాంకులు ఎంసీఎల్ఆర్​ని పెంచినప్పుడు, కొత్త బారోవర్లు తమ ఆటో, హోం, వెహికల్​ లోన్ల కోసం మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాబోయే నెలల్లో వారి ఈఎంఐలు పెరుగుతాయి. “ 2023 మార్చి  నాటికి  వడ్డీ రేటు 75 బేసిస్​ పాయింట్ల వరకు పెంచుతారు. 2024 మార్చి  నాటికి మరో 50 బేసిస్​ పాయింట్లు పెరుగుతుంది. ఆర్​బీఐ రేట్ల పెంపు  ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​ రెండవ క్వార్టర్​ నుండి ప్రారంభమవుతుందని అనుకుంటున్నాం” అని ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లోని కోర్ ఎనలిటికల్ గ్రూప్ డైరెక్టర్ సౌమ్యజిత్ నియోగి అన్నారు. లోన్ల రేట్లు ప్రస్తుత స్థాయుల నుండి 100–-125 బేసిస్​ పాయింట్లు పెరగవచ్చని, దీనివల్ల  బారోవర్ల జేబుపై చాలా భారం పడుతుందని మరో ఎనలిస్టు స్పష్టం చేశారు. 

డిమాండ్​ తగ్గే ప్రమాదం..

ఈఎంఐలకు కట్టే అమౌంట్‌ పెరిగితే బ్యారోవర్లు మిగతా ఖర్చులు తగ్గించుకుంటారు. దీనివల్ల కన్సంప్షన్​, డిమాండ్​ చాలా తగ్గుతుంది. బ్యాంకుల కిస్తీలు ఆలస్యమై బకాయిలు పెరిగే ప్రమాదమూ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ , మూడేళ్లలో మొదటిసారిగా ఈ నెలలో అన్ని టెన్యూర్ల లోన్లపై ఎంసీఎల్​ఆర్​ను 15 నుండి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. యాక్సిస్ బ్యాంక్,  కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఇటీవల తమ ఎంసీఎల్ఆర్‌‌ను పెంచాయి. బుల్లెరో క్యాపిటల్‌‌‌‌‌‌‌‌లోని ఫండ్ మేనేజర్  డైరెక్టర్ వరుణ్ ఖండేల్‌‌‌‌‌‌‌‌వాల్ మాట్లాడుతూ ఆర్​బీఐ రెపో రేటును పెంచే అవకాశాలు ఉండటంతో స్టేట్​ బ్యాంకు,  యాక్సిస్ బ్యాంక్ వంటి మార్కెట్ లీడర్లు ఎంసీఎల్​ఆర్​​ను పెంచుతాయని అన్నారు.  ఇతర బ్యాంకులు కూడా ఇదే బాట పడుతాయని అన్నారు. స్టేట్​బ్యాంక్​లో ఒక సంవత్సరం ఎంసీఎల్​ఆర్​ 7.1 శాతం కాగా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్,  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లలో ఇది 7.25 శాతం ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా  ఒక సంవత్సరం ఎంసీఎల్​ఆర్​ 7.35 శాతంగా ఉండగా, యాక్సిస్ బ్యాంక్  కోటక్ మహీంద్రా బ్యాంక్  ఎంసీఎల్​ఆర్​7.40 శాతం ఉంది. ఇన్​ఫ్లేషన్​ చాలా ఎక్కువ ఉన్నందున ఆర్​బీఐ జూన్​లో రెపో రేట్లను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రిటైల్ ఇన్​ఫ్లేషన్​ 17 నెలల హైలెవెల్​ 6.95 శాతానికి ఎగబాకగా, టోకు ధరల ఇన్​ఫ్లేషన్​ వరుసగా 12 నెలల నుంచి రెండంకెలకు తగ్గడం లేదని బార్​క్లేస్​ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ రాహుల్ బజోరియా అన్నారు.  జూన్ క్వార్టర్​ నుంచి ఆర్​బీఐ రెపో రేటును వరుసగా నాలుగు సార్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రెపో రేటు నాలుగు శాతం నుండి 5 శాతానికి పెరగవచ్చని చెప్పారు. అన్ని రకాల లోన్లకు వడ్డీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. రెపోరేటు మారకున్నా కొన్ని బ్యాంకులు వడ్డీలు పెంచుతాయని  బ్యాంక్​బజార్​డాట్​కామ్​ సీఈఓ ఆదిల్ శెట్టి అన్నారు. రెపో రేటును పెంచితే ‘ఎక్స్​టర్నల్​ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్-లింక్డ్ లెండింగ్ రేట్’ (ఈబీఎల్​ఆర్) కూడా పెరుగుతుందని, దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆర్​బీఐ ఈబీఎల్​ఆర్ ను  అక్టోబర్ 2019 నుంచి అమలు చేస్తోంది. అప్పటి నుండి బ్యాంకుల లోన్లు,  డిపాజిట్ రేట్లు మెరుగుపడ్డాయి.  ఈ నెల 18న విడుదల చేసిన ఆర్​బీఐ నెలవారీ బులెటిన్ ప్రకారం, బ్యాంకుల ఈబీఎల్​ఆర్​ లోన్ల వాటా సెప్టెంబర్ 2019లో 2.4 శాతం నుండి మార్చి 2021లో 28.6 శాతానికి  డిసెంబర్ 2021లో 39.2 శాతానికి పెరిగింది.