ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. రెండు బ్యాంకు సంఘాలు 24 గంటల సమ్మెను ప్రకటించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈ మధ్య కాలంలో బ్యాంకు విలీనాలు, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమ్మెకు దిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కార్పోరేషన్ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనడం లేదు. అయితే సమ్మె కారణంగా పలు బ్యాంకుల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

