- 4 గంటల నుంచి 6 వరకు ఖాళీగా గవర్నమెంట్ హాస్పిటళ్లు
- 50 నుంచి 100 మందికి మించడం లేదంటున్న డాక్టర్లు
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతున్న పేషెంట్ల రద్దీ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌తోపాటు జిల్లాల నుంచి వచ్చేవారి కోసం సిటీలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రారంభించిన ఈవెనింగ్ ఓపీ సేవలను జనం వినియోగించుకోవడం లేదు. సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు ఓపీ బ్లాక్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రం ఎప్పటిలాగే ఓపీ కౌంటర్ల వద్ద రష్ కొనసాగుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి కొన్నిసార్లు వైద్యం లేట్అవుతోందని, రిపోర్టుల కోసం మరుసటిరోజు వరకు ఆగాల్సి వస్తోందని ప్రభుత్వం గత నెల 25 నుంచి టీచింగ్ హాస్పిటల్స్‌లో సాయంత్రం ఓపీలను ప్రారంభించింది. ఈ టైంలో 5 రకాల వైద్య సేవలు అందిస్తోంది. కానీ జనం పెద్దగా రావవడం లేదు. డైలీ 50 నుంచి 100 మంది లోపే వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఒకటి రెండు చోట్ల పూర్తిగా ఖాళీగా ఉంటున్నాయని అంటున్నారు.
ఐదు విభాగాలతో..
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తోపాటు అన్ని మెటర్నిటీ హాస్పిటల్స్ లో సాయంత్రం 4 గంటల నుంచి 6వరకు ఈవెనింగ్ ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ టైంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ స్పెషలిస్టులు అందుబాటులో ఉంటున్నారు. రొటీన్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్‌లు కూడా అదే రోజున నిర్వహించి రిపోర్టులు అందజేస్తున్నారు. అయితే హాస్పిటళ్లలో డాక్టర్లు ఉంటున్నా పేషెంట్లు రావడం లేదు. హాస్పిటళ్ల బయట ఈవెనింగ్ ఓపీల గురించి బ్యానర్లు కట్టి ప్రచారం చేస్తున్నా రెస్పాన్స్అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాల నుంచి వచ్చేవారికి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, ఉదయపు అలవాటుతో ఎప్పటిలాగే రావడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రష్ కొనసాగుతోంది. సాయంత్రం సేవలు ఉన్నా ఎవరూ వినియోగించుకోవడం లేదు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈవెనింగ్ ఓపీకి వస్తున్న వారి సంఖ్య 100కు దాటడంలేదు. గాంధీలో 100 మంది లోపు ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, పేట్లబురుజు హాస్పిటళ్లకు డైలీ 50 మంది లోపు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
అన్నిచోట్లా ఇంతే
పెద్దాసుపత్రుల్లో ఉదయం ఓపీకు వందల మంది వస్తున్నారు. ఒక్కోచోట 800 నుంచి వెయ్యి, 2 వేల మంది వస్తున్నారు. వీరిలో సిటీతో పాటు జిల్లాల నుంచి వచ్చేవారే అధికంగా ఉంటున్నారు. అందరికీ ఉదయం ఓపీ అలవాటు అయిపోవడంతో పొద్దున్నే వచ్చి చెకప్‌లు చేయించుకుని వెళ్లిపోతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తో పాటు అన్ని మెటర్నిటీ హాస్పిటల్స్ లో ఇదే రష్ కొనసాగుతోంది. గతంలో ఉదయం ఓపీ మధ్యాహ్నం 12.30 వరకు వరకు అందుబాటులో ఉండేది. దీన్ని 2గంటల వరకు పెంచడంతో ఆ టైంలోనే వచ్చి వెళ్లిపోతున్నారు. మరోవైపు ప్రతి హాస్పిటల్‌లో 24 గంటల అత్యవసర సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఏదైనా అత్యవసరం ఉంటే ఎమర్జెన్సీ బ్లాక్‌లకు వస్తున్నారని డాక్టర్లు, నర్సులు చెబుతున్నారు.
డైలీ 50 మంది లోపే..
సాయంత్రం పూట జనరల్ ఓపీ ఉద్దేశం మంచిదే అయినా పేషెంట్లు చాలా తక్కువగా వస్తున్నారు. గాంధీలో 24 గంటలు ఎమర్జెన్సీ సేవలతోపాటు రెగ్యులర్ ఓపీ సేవలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో సాయంత్రం పూట ఓపీకి రావడం లేదు. బస్తీ దవాఖానలు పెరగడంతో ఇక్కడి దాకా రావడం లేదు. డైలీ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు 50 మంది లోపే వస్తున్నారు.
- ప్రొ.ఎస్.రాజేశ్వర్‌రావు,
టీజీజీడీఏ గాంధీ యూనిట్ ప్రెసిడెంట్
