కోర్టు కాంప్లెక్స్ ను పట్టణంలోనే నిర్మించాలి : మల్లారెడ్డి

కోర్టు కాంప్లెక్స్ ను  పట్టణంలోనే నిర్మించాలి : మల్లారెడ్డి
  • నిర్మల్​ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టుతోపాటు ఇతర కోర్టుల భవనాలను పట్టణంలోనే నిర్మించాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి డిమాండ్ ​చేశారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టు బిల్డింగ్ కాంప్లెక్స్ ను నిర్మల్ పట్టణానికి దూరంగా ఉన్న మహిళా ప్రాంగణం వద్ద నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరికాదన్నారు. పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ ప్రాంతాన్ని కలుపుకొని ప్రస్తుతమున్న కోర్టు స్థలంలో లేదా పాత ఇరిగేషన్ కన్ స్ట్రక్షన్ ఆఫీస్ ఏరియాలో నిర్మించాలని కోరారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొ న్నారు. 

ఇప్పటికే కలెక్టరేట్​ను పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించడంతో అక్కడికి వెళ్లేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారని అన్నారు. కోర్టును మహిళా ప్రాంగణం వద్ద నిర్మిస్తే పట్టణ వాసులతోపాటు ఖానాపూర్, భైంసా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ సూచనలను పరిగణలోకి తీసుకొని పట్టణం లోనే కోర్టు భవన సముదాయాన్ని నిర్మించాలని కోరారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంపోలి నర్సారెడ్డి, అసోసియేషన్ బాధ్యులు వంశీకృష్ణ, రత్నం, మధుకర్, సాయికుమార్, రమణ, రాజు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.