లాయర్లకు బీమా రూ. 10 లక్షలకు పెంపు : బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి

లాయర్లకు బీమా రూ. 10 లక్షలకు పెంపు : బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: లాయర్లకు ఇన్సూరెన్స్‌ పాలసీని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ. నరసింహారెడ్డి వెల్లడించారు. న్యాయవాదుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. కోర్టు స్టాంపు ఫీజు ద్వారా వచ్చిన సొమ్ము నుంచి ఈ పాలసీలకు చెల్లింపులు చేస్తామన్నారు. ఇందులో భాగంగా జీవిత బీమాను రూ.6 నుంచి రూ.10  లక్షలకు పెంచామన్నారు. 

అలాగే సభ్యులు మరణించినపుడు చెల్లించే మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.20 వేలకు, వైద్య ఖర్చులకు రూ.లక్ష, జూనియర్లకు లైబ్రరీ రుణం రూ.10 నుంచి రూ.15 వేలకు పెంచినట్లు తెలిపారు. ఈ పెంపు అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందన్నారు. సమావేశంలో బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ సునీల్‌గౌడ్, బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.