రబీ ధాన్యం లిఫ్ట్ చేయని బిడ్డర్ల సెక్యూరిటీ డిపాజిట్ జప్తు!

రబీ ధాన్యం లిఫ్ట్ చేయని బిడ్డర్ల సెక్యూరిటీ డిపాజిట్ జప్తు!
  • 2022- 23 పెండింగ్ ధాన్యంపై  ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రబీ సీజన్ 2022-–23కు సంబంధించి ధాన్యం వేలంలో టెండర్ దక్కించుకుని, ధాన్యం లిఫ్ట్ చేయని బిడ్డర్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సివిల్ సప్లైస్ కమిషనర్ నివేదికల ఆధారంగా.. నాకాఫ్ , కేంద్రీయ భండార్ సంస్థలతో సహా బిడ్డర్ల నుంచి రూ. 65.90 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌‌ను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

 ఈ మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్‌‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు. రబీ సీజన్ 2022–-23లో ధాన్యం వేలంలో టెండర్ గెలుచుకున్న కొందరు బిడ్డర్లు.. ఒప్పందం ప్రకారం ధాన్యం తీసుకోకపోవడంతో ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లింది. దీనిపై సివిల్ సప్లైస్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా.. సెక్యూరిటీ డిపాజిట్‌‌లను జప్తు చేయడంతో పాటు ఆయా  సంస్థలపై తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

2022-–23 రబీ సీజన్‌‌కు సంబంధించి మిగిలిన ధాన్యం నిల్వల విక్రయంపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ప్రభుత్వం కేబినెట్ సబ్‌‌-కమిటీకి అప్పగించింది. ఈ నిల్వలను మిల్లర్ల నుంచి వసూలు చేసే విషయంలో చట్టపరమైన అంశాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా -కమిటీకి అప్పజెప్పింది.ఈ చర్యలతో ధాన్యం సేకరణ, విక్రయంలో ఒప్పందాలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన వైఖరి అవలంబించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

 కేబినెట్ సబ్‌‌-కమిటీ మిగిలిన ధాన్యం నిల్వల విక్రయంపై చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ధాన్యం సేకరణ, విక్రయ ప్రక్రియలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది.