అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?

అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తున్నది?

అమెరికా  వ్యవసాయ, పాడి పరిశ్రమ ఉత్పత్తులను భారతదేశ మార్కెట్లో అనుమతి ఇచ్చే విషయంలో  భిన్నాభిప్రాయాల కారణంగా భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి.  అమెరికా తమ  దేశ   వ్యవసాయం,   పాడి పరిశ్రమ, మత్స్యరంగాల ఉత్పత్తులను  భారతదేశంలో అమ్ముకోవటం  కోసం ఒత్తిడి చేస్తుండగా,  భారత్​ తమ దేశ రైతులను రక్షించుకోవటానికి  అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. 

 అమెరికా తమ దేశ ఆవులను మేపడానికి  జంతు సంబంధ ఆహారం (దాణా) ఉపయోగిస్తుంది.  కాబట్టి, ఆ ఆవుల ద్వారా వచ్ఛే పాలను (నాన్ వెజ్ -పాలు)  అనుమతించడానికి భారతదేశం ఇష్టపడటం లేదు. భారతదేశ 3.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు కేవలం 16% మాత్రమే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు దోహదపడుతున్నాయి.

భారతదేశ పాడి పరిశ్రమ రంగం 1.4 బిలియన్లకు పైగా ప్రజలకు ఆహారం ఇస్తోంది. 80 మిలియన్లకు పైగా ఉపాధి కల్పిస్తోంది.  ప్రధానంగా చిన్నకారు రైతులు. కావున అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలోనికి అనుమతిస్తే   భారత దేశ  రైతుల  నుంచి  ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను  ఎదుర్కోవలసి వస్తుంది.  

జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలు అంటే ఏమిటి?

ప్రకృతి సిద్ధంగా మొక్కలలో జన్యు పదార్థం (డీఎన్ఏ) మార్పిడి ‘పరపరాగ సంపర్కం’ ద్వారా జరుగుతుంది.  అంటే ఈ ప్రక్రియలో  ఒక మొక్కలోని పువ్వు  పుప్పొడి అదే జాతికి చెందిన వేరే మొక్క  పువ్వును చేరుతుంది.  దీని ఫలితంగా  భిన్నమైన లక్షణాలతో  కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఈ పద్ధతినే రీకాంబినేషన్ అని అంటారు. 

ఈ పద్ధతి ద్వారా మొక్కలలో జన్యు వైవిధ్యం పెరుగుతుంది. ఇది కొత్త కలయికలను  సృష్టించడం ద్వారా పంటల దిగుబడి, నాణ్యత,  తెగుళ్ల నిరోధకత పెరుగుతుంది.  కృత్రిమంగా ‘రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీలో’  శాస్త్రవేత్తలు  ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఉద్దేశపూర్వకంగా ఒక జాతి  నుంచి జన్యువులను తీసుకొని  మరొక జాతి  మొక్కలు లేదా ఇతర జీవులలో చొప్పిస్తారు.  

ప్రయోజనాలు– వివాదాలు

భారతదేశంలో బీటీ కాటన్, పత్తి సాగును విప్లవాత్మకంగా మార్చింది. బీటీ కాటన్ స్వయంగా కీటకాలను నిరోధిస్తుంది. కాబట్టి, ఇది రైతులకు కీటకాల నుంచి రక్షణ కల్పించి దిగుబడిని పెంచింది. పురుగుమందుల వాడకాన్ని తగ్గించింది.  భారతదేశంలో బీటీ కాటన్ ప్రవేశపెట్టిన (2002లో) తర్వాత పత్తి దిగుబడి 20–-30% పెరిగింది.  కొన్ని ప్రాంతాలలో,  బోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వార్మ్ వంటి కీటకాలు బీటీ టాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరోధకతను అభివృద్ధి చేశాయి.

బీటీ గింజలు సాధారణ గింజల కంటే ఖరీదైనవి,  రైతులకు ఆర్థిక భారం కలిగిస్తాయి.  ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం గురించిదరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటీ విత్తనాలు ఒక్కసారి మాత్రమే వినియోగానికి  పనికొస్తాయి. కావున బహుళ జాతి కంపెనీలకు  జీఎం విత్తనాలపై  పేటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  కలిగి ఉండటం వలన  రైతులు బహుళ జాతి  కంపెనీలపై ఆధారపడవలసి వస్తుంది.  

అమెరికా పాల ఉత్పత్తులతో  సమస్య 

ప్రకృతి సిద్ధంగా ఆవులు  శాకాహారులు.  పచ్చగడ్డి. ఎండుగడ్డి వంటి మొక్క  సంబంధిత ఆహార పదార్థాలను ప్రాసెస్ చేయడానికి ఆవు  జీర్ణవ్యవస్థ  రూపొందింది. అయితే, యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   పారిశ్రామిక వ్యవసాయ కార్యకలాపాలలో భాగంగా  పశువులకు,  వాటి ఆహారంలో  జంతువుల నుంచి సేకరించిన  ఉత్పత్తులను తినిపిస్తారు.  జంతు ఉత్పత్తులను తినే  ఆవుల ద్వారా పొందే  పాలను  ‘మాంసాహార పాలు’ అని  భారతదేశంలో వ్యవహరిస్తారు.

 దాదాపు 38% మంది భారతీయులు శాఖాహార ఆహారాన్ని అనుసరిస్తారు. -కాబట్టి,  భారతదేశం ఇలాంటి పాలను అనుమతించదు. అమెరికాలో వ్యవసాయం పారిశ్రామిక రంగం కావున ఖర్చు తగ్గించు కోవటానికి, ఎక్కువ  లాభాలను పొందటం కోసం,   అధిక పాల ఉత్పత్తి కోసం,  అధిక- నాణ్యత,అధిక ధర గల ఎండుగడ్డి వంటి మొక్కల ఆధారిత  దాణాల కంటే చౌకగా లభించే జంతు ఉత్పత్తులను  ఆవులకు  తినిపిస్తారు.

'మాడ్ కౌ డిసీజ్​ ' 

ఆవులకు  జంతు ఉత్పత్తులను తినిపించడం వలన ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధి 'మాడ్ కౌ డిసీజ్' 1980, 1990లలో ఇంగ్లాండ్​లో,  2003, 2012లో  అమెరికాలో  ఆవులకు వ్యాప్తి చెందింది.  ఈ వ్యాధి  సోకిన ఆవు మాంసం తిన్న మానవులకు ‘క్రూట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెల్డ్ట్-జాకోబ్ డిసీజ్’ అనే  మెదడు సంబంధిత వ్యాధి అభివృద్ధి చెందింది.  

వ్యవసాయానికి,  పాడి పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే భారతదేశంలో  రైతుల జీవనోపాధికి, వ్యవసాయ,  పాడి పరిశ్రమ రంగాలకి,  ప్రజల ఆరోగ్యానికి హాని కలుగజేసే అమెరికా వ్యవసాయ, పాడి పరిశ్రమ ఉత్పత్తులను  భారతదేశ మార్కెట్లలోనికి  ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అనుమతించడం సాధ్యంకాదు.

భారతదేశ పాడి రైతుల ఉపాధికి ప్రాధాన్యం

భారతదేశ  పాడి పరిశ్రమ లక్షలాది మంది చిన్న తరహా రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఈ కారణంగా  పాడి రైతుల ఉపాధికి ప్రాధాన్యమివ్వాలి.  వీరిలో చాలామంది తమ జీవనోపాధి కోసం కేవలం 1–3 ఆవులపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం  దేశ పాడి పరిశ్రమ భారతదేశ  స్థూల విలువ జోడింపుకి దాదాపు  2.5–3% తోడ్పడుతోంది, ఇది రూ. 7.5–9 లక్షల కోట్లు.  అందువల్ల ఏదైనా అంతరాయం గ్రామీణ ఆదాయం, జీవనోపాధిపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

- డా.శ్రీధరాల రాము,ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్–