బిహార్ లో .. పీకే హవా పెరుగుతోందా?

బిహార్ లో ..   పీకే హవా పెరుగుతోందా?

కార్ల్​ మార్క్స్ గొప్ప చరిత్రకారుడు.  నేటి మార్క్సిజం ఆయన ఆలోచనలపై ఆధారపడి ఉంది. మార్క్స్ సుమారు 150 సంవత్సరాల క్రితం ఇలా అన్నాడు  ‘పురుషులు తమ సొంత చరిత్రను సృష్టిస్తారు.  కానీ, వారు తమ ఇష్టానుసారంగా దానిని సృష్టించరు’.  బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2025 బీహార్ శాసన సభ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తారా?  లేదా ఆయన చరిత్రను  చెత్తబుట్టలో పడేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. 

 గత 20 సంవత్సరాలుగా  నితీశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారానికి  సవాలు విసురుతున్న వ్యక్తి  ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.  ఆయన పార్టీ ఈసారి బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో  గెలవకపోతే, లాలూ  గత చరిత్రగా మారిపోతారు. అంతేకాదు, రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ) గణనీయమైన స్థానాల్లో  గెలవకపోతే  మొత్తం లాలూ కుటుంబమే ఇబ్బందుల్లో పడుతుంది.  మరోవైపు బిహార్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రజాదరణను పరీక్షిస్తోంది. రాహుల్ గాంధీ రాజకీయ శైలి ఎన్నికల్లో గెలవగలదా లేదా అనేది కూడా బిహార్​తోపాటు దేశం మొత్తం పరీక్షిస్తోంది

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్న మొదటి అంశం ఏమిటంటే.. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ఈసారి ఎన్నికల్లో గెలుస్తారా అనేది. ఎందుకంటే  నితీశ్​ కుమార్ గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తే., దాని అర్థం లాలూ ప్రసాద్ యాదవ్ శకం ముగింపు,  రాహుల్ గాంధీకి పెద్ద రాజకీయపరమైన ఎదురుదెబ్బ తగిలినట్టు అవుతుంది. ఈ రెండు పరిణామాలు  ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద ప్రోత్సాహకంగా మారతాయి. 

ఎన్డీఏ కూటమిని  అధిగమించి  ప్రతిపక్ష  ఇండియా అలయన్స్ గెలిచి బిహార్​లో అధికారంలోకి వస్తే అది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పెద్ద ఉత్సాహాన్నిస్తుంది. ఈ గెలుపు కారణంగా 2024 పార్లమెంట్ ఎన్నికలు, మహారాష్ట్ర,  హర్యానా అసెంబ్లీ ఎన్నికల పరాజయాలను  ప్రజలు మరచిపోతారు. ఒకవేళ బిహార్​ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటమిపాలైతే.. ఆ  ఓటమి  ఇండియా కూటమితోపాటు  రాహుల్ గాంధీ  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా  ప్రమాదంలో పడేస్తుంది.  

అయితే, ఈసారి బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నిక బరిలోకి  కొత్తగా  ప్రవేశించినవారిలో  ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒకరు,  ఆయన పార్టీ గత నెలలో  వేగం పుంజుకుంది. కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దాదాపు 10 నుంచి 15% ప్రజల మద్దతు ఉందని, అది ఓట్లరూపంలో నిజమైతే  ప్రశాంత్ కిషోర్  బిహార్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారని సర్వేల నివేదికలు చెబుతున్నాయి.

బిహార్ ఎన్నికల చరిత్ర

గత 35 సంవత్సరాలుగా  బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజకీయ వంశాలు,  మాఫియా లార్డ్స్,  కులాల అధిపతులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.  వారి కుటుంబాలు ఎన్నికలలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.  కొత్త ముఖాలకు అధికారంలో భాగస్వాములయ్యే  అవకాశం లభించదు.   ఇది ప్రాంతీయ పార్టీలతోపాటు  జాతీయ పార్టీలకు వర్తిస్తుంది. కొత్త ముఖానికి ఎప్పుడూ అవకాశం లభించడం లేదు. 

ఒకవేళ అతను బిలియనీర్ లేదా 'బాహుబలి లేదా బలవంతుడు' అయితే తప్ప ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాదు. బిహార్ రాజకీయాల్లో  పూర్తి స్తబ్ధత, అవినీతి  నెలకొంది, ఒకరు బట్టలు మార్చుకున్నంత సులభంగా పార్టీలు మారినప్పటికీ ఆ రాజకీయ నాయకులే  ఆధిపత్యం చెలాయిస్తున్నారు.  నితీశ్​కుమార్  లేదా లాలూ ప్రసాద్  లేదా  బీజేపీ,  కాంగ్రెస్..  మార్పును  సూచించవు. 

 బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజకీయ స్తబ్ధత  ఆధిపత్యం చెలాయిస్తోంది. బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని పార్టీలలోనూ రాజకీయ రాజవంశాలు బలమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.   ఇతరులకు చోటు లేదు.  రాజకీయ వంశాలకు  పదవులందించేవిధంగా రాజకీయాలు మారిపోయాయి.  ఈ తరుణంలో  ప్రశాంత్​ కిషోర్​ మాత్రం ఓటరు దృష్టిలో క్లీన్​గా కనిపిస్తుండటం సహజం.

ప్రశాంత్ కిషోర్ పాత్ర

దేశవ్యాప్తంగా  ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా  ప్రసిద్ధుడు.  అక్టోబర్ 2024లో ఆయన సొంతంగా జన్​ సురాజ్​ పార్టీని ప్రారంభించాడు. బిహార్​లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రశాంత్ కిషోర్  చెప్పినప్పుడు ఆయనతో  ఎవరూ ఏకీభవించలేదు.  కానీ,  వాస్తవం ఏమిటంటే ప్రశాంత్​ కిషోర్  బలాన్ని కూడగట్టుకుంటున్నాడు. ఆయన జన్​ సురాజ్​ పార్టీ బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో 15% ఓట్లు పొందగలిగితే,  బిహార్  మొత్తం ఊహించని ఎన్నికల ఫలితాలను చూస్తుంది.  ఆ ఫలితాలు పాత ఆధిపత్య పార్టీలను  కలవరపెడతాయి. 

బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యువతకు చాలామంది రాజకీయ నాయకులు అవినీతిపరులని, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, కుటుంబ రాజకీయాలు చేయడానికి కులం లేదా మతాన్ని ఉపయోగిస్తారని తెలుసు.  ప్రశాంత్ కిషోర్ ప్రత్యామ్నాయ,  కొత్త రాజకీయాలను సూచిస్తున్నాడు.  రాబోయే రోజుల్లో  చాలామంది  ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలో  ప్రశాంత్​ కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చేరతారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

 బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  నేపాల్ ప్రభావం!

ఇది వింతగా అనిపించవచ్చు.  కానీ,  బిహార్  నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పొడవైన సరిహద్దును కలిగి ఉంది.  నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  లక్షలాది మంది ప్రజలు బిహారీ మూలానికి చెందినవారని గుర్తుంచుకోవాలి.  ఉత్తర బిహార్  నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  దాని సొంత ప్రదేశంగా  భావిస్తుంది.  

నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మార్పుకోసం యువత ఉత్సాహం బిహారీ యువత మనస్సుపై  గొప్ప ప్రభావాన్ని చూపింది.  నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కొన్ని పరిస్థితులు బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కూడా ఉన్నాయి.  నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాగ  బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  అవినీతి,  కులతత్వం,  అభివృద్ధి లేకపోవడం వంటివి  పట్టిపీడిస్తున్నాయి. నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ప్రభుత్వాన్ని పడగొట్టడం,  రాజకీయ  నాయకులను  తరిమికొట్టడం..  బిహారీ యువతకు మార్పు సాధ్యమనే 
సంకేతాలను పంపింది.  

బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మార్పుకోసం ఆక్కడ యువత పోరాటం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.  ప్రశాంత్​ కిషోర్  బిహార్​లో మార్పును అందించే నాయకుడిగా కనిపిస్తున్నారు. బిహార్​ యువత ఆయనను  ప్రత్యామ్నాయ  నేతగా భావిస్తున్నారు. 

ఎవరు గెలుస్తారు?

ప్రశాంత్ కిషోర్  బిహార్​లో తన  ప్రభావాన్ని చూపుతారు. కానీ,  ఇది  ఆయన పార్టీకి తొలి  ఎలక్షన్.  కిషోర్ పార్టీ  మెరుగైన ఓట్ల శాతాన్ని పొందగలిగితే  బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  దిగ్భ్రాంతికరమైన ఓటములు, అనూహ్య విజయాలు ఉంటాయి. లాలూ ప్రసాద్,  ఇండియా అలయన్స్ 2005 నుంచి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ, యాదవులు,  ముస్లింల కారణంగా లాలూ ప్రసాద్  బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నారు. 

 ప్రశాంత్ కిషోర్  బీజేపీ కూటమి  ఓట్లను తీసుకుంటే  లాలూ ప్రసాద్​ యాదవ్​ లాభపడతాడు.  రాహుల్ గాంధీ,  తేజస్వీ యాదవ్ మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే, అది కాంగ్రెస్  ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా పొందడానికి బహిరంగంగా చేసిన ప్రయత్నం మాత్రమే. రాహుల్, తేజస్వీ ఇద్దరూ రాజకీయ మనుగడ సాగించడానికి ఒకరినొకరు మద్దతు కోరుకుంటారనేది యథార్థం. నితీశ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచిపేరు,  గెలిచే అవకాశం ఉంది.  కానీ,  ప్రశాంత్ కిషోర్  ఆయన గెలుపును దెబ్బతీస్తారా? అనేది ప్రశ్న!  నరేంద్ర మోదీ ఆకర్షణ నితీష్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహాయం చేస్తుందా అనేది స్పష్టత రావాలి.  

మార్పు కోరుకుంటున్న బిహార్​ యువత

 నితీశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక రకమైన స్తబ్ధత ఉంది. ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజాదరణ పొందారు. ఆయన నిజాయితీపరుడని గుర్తుంచుకోండి.  కానీ, ప్రజలు మార్పుకోసం ఓటు వేశారు.  పాతతరం ఒడిశా రాజకీయ నాయకులను తరిమికొట్టారు.  బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నితీశ్​కుమార్ లేదా  లాలూ యాదవ్ మార్పుకు ప్రాతినిధ్యం వహించలేదు.  వారిని అవినీతి  రాజకీయాలు  వెంటాడుతున్నాయి.  1989 నుంచి  బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లాలూ ప్రసాద్ యాదవ్  లేదా నితీశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రమే అనుకూలంగా ఉంది.

 బిహార్ ఒక పెద్ద రాష్ట్రం.  ప్రశాంత్ కిషోర్ 2013లో ఢిల్లీలో  కేజ్రీవాల్ చేసినట్లుగా అద్భుతం చేయలేడు.  కానీ,  నేపాల్ గాలులు బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి బలంగా వీస్తున్నాయి. బిహార్ యువత మార్పు కోరుకుంటున్నారు.  బిహార్  రాజకీయాల దుర్వాసన,  అవినీతి,  రాజవంశాలు,  స్తబ్ధతను తుడిచిపెట్టేంత బలంగా నేపాలీ హిమాలయ గాలులు ఉన్నాయో లేదో చూద్దాం!   ఒక చిన్న షాక్ కూడా మార్పుకు సరిపోతుంది!


- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్​-