
పెంబి, వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో జరిగింది. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మేన పెద్దులు (50) తనకున్న రెండు ఎకరాల్లో పత్తి, పసుపు సాగు చేశాడు. పంట పెట్టుబడుల కోసం సుమారు రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు.
ఇటీవల భారీ వర్షాలు పడడంతో పంట సరిగా ఎదగలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన పెద్దులు మంగళవారం తన చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూడగా.. అక్కడ కింద పడిపోయి కనిపించడంతో వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి నిర్మల్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్ జిల్లాలో..
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామారం గ్రామానికి చెందిన అఖిల్ (22) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామారం గ్రామానికి చెందిన ఉడుత హైమకు ఇద్దరు కొడుకులు. ఆమె భర్త గట్టయ్య ఆరేండ్ల కింద చనిపోయారు. కుటుంబానికి రూ. 5 లక్షల అప్పు ఉంది.
హైమ రెండో కొడుకు అఖిల్(22) తమ రెండెకరాల భూమిలో పత్తి, వరి సాగు చేశాడు. వారం రోజులుగా యూరియా కోసం తిరిగినా దొరకడం లేదు. పైగా.. పాత అప్పులకు తోడు ప్రస్తుత పంట కూడా నష్టపోవాల్సి వస్తుందన్న మనస్తానంతో మంగళవారం రాత్రి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు.
విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పగా వారు బావి వద్దకు వెళ్లి అఖిల్‌ను వర్ధన్నపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వర్ధన్నపేట పోలీసులు తెలిపారు.