గ్రూప్ 1 పరీక్షపై బీఆర్ఎస్ సృష్టిస్తున్న అపోహలు

గ్రూప్ 1 పరీక్షపై   బీఆర్ఎస్ సృష్టిస్తున్న అపోహలు

గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనేది బీఆర్​ఎస్, బీజేపీ రాజకీయ ప్రేరేపితమైన ఒక కట్టుకథ మాత్రమే.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11ఏండ్ల తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిర్వహించటం చేతకాని  తొలి గ్రూప్ 1 పరీక్షను  రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. అంతేకాదు గ్రూప్ 2,3 పరీక్షలను సైతం నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. 

ఇది చూసి  బీఆర్ఎస్ తన రాజకీయ లబ్ధి కోసం ఏదో రకంగా గ్రూప్ 1 పరీక్ష ను అడ్డుకునేందుకే అనేక కుట్రలు పన్నుతోంది.  గ్రూప్1 పిలిమ్స్, మెయిన్స్​లో విఫలమైన అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.  మొత్తం 21,093 మంది మెయిన్స్ రాస్తే 563 మంది మాత్రమే గ్రూప్ 1 అధికారులుగా నియామకం అవుతారు. మిగతా 20,530 మంది సహజసిద్దంగా అసంతృప్తితో ఉంటారు.     దీంతో బీఆర్ఎస్  నేతలు   గ్రూప్ 1పై  పథకం ప్రకారం దుష్ప్రచారం చేయిస్తున్నారు. 

 అపుడు లీకులు, ఇపుడు అపోహలు

 గత  బీఆర్ఎస్  పాలనలో సుమారు  22  నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు లీకులయ్యాయి. ఇపుడు అదే బీఆర్​ఎస్​ గ్రూప్​1పై అపోహలు సృష్టిస్తోంది.  సీఎం రేవంత్ రెడ్డి గత నోటిఫికేషన్లను సరిచేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు.  భర్తీ చేయగా మిగిలిపోయిన గ్రూప్ 1, గ్రూప్ 2,  గ్రూప్ 3 పాత నోటిఫికేషన్ల బూజు దులిపి మొత్తం ఖాళీగా ఉన్న 1,45,000 వేలకి పైగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళికను కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసింది.

 ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి అమలు చేయటం వల్ల ఉద్యోగాల భర్తీకి  ఏప్రిల్  వరకు ఆటంకం ఏర్పడింది. ఆ తరవాత గ్రూప్ 1పై  హైకోర్టులో  కేసు వేయడం, విచారణ జరిగాక కోర్టు తీర్పు రావడానికి 2 నెలల పాటు సమయం పట్టింది. దీని మూలంగా  గ్రూప్ 1, గ్రూప్ 2,  గ్రూప్ 3 నియామక ప్రక్రియ ఒకదానికి ఒకటి ముడిపడి ఉండటం వలన నోటిఫికేషన్ల విడుదలలో కొంత మేర జాప్యం జరిగింది. 

ఈలోపు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంపూర్ణ సంఖ్యను నిర్ణయించేందుకు ఐఏఎస్  అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది.  వీరి నివేదిక అందిన వెంటనే ఆగిపోయిన జాబ్ క్యాలెండర్ ను అక్టోబర్ నెలలో పట్టాలు ఎక్కించి నిరుద్యోగులను సంతృప్తి పరచాలని రేవంత్ రెడ్డి సర్కార్   నిర్ణయించింది. ఇంతలో గ్రూప్ 1 నియామక పత్రాలు ఇచ్చే ఆఖరి దశలో  గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై తీర్పు వెలువడింది.  

రేవంత్  సర్కార్  నిరుద్యోగులకు కీడు చేయదు

గ్రూప్ 1లో హైకోర్టు కేవలం మూల్యాంకనంలో  తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మాధ్యమం అభ్యర్థుల మధ్య మార్కుల వ్యత్యాసం  ఉందని మాత్రమే చెప్పింది.  సంజయ్ సింగ్ వర్సెస్​  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (2007) సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాత పరీక్షలో కఠిన మూల్యాంకనం,  సులభ మూల్యాంకనం వలన అభ్యర్థుల మార్కుల్లో తేడా ఉన్నప్పుడు  చీఫ్ ఎగ్జామినర్ మోడరేషన్  పద్ధతిలో ఆ మార్కులను స్కేలింగ్ చేసి సరాసరి విధానంలో ఒకేస్థాయికి తీసుకురావాలి. ఈ విధానం టీజీపీఎస్సీలో లోపించిందని మాత్రమే కోర్టు పేర్కొంది.  
 
ఒకేరకమైన మార్కులు 713 మందికి వచ్చాయని మరో ఆరోపణ. ఈ ఆరోపణకి  టీజీపీఎస్సీ ఈవిధంగా సమాధానం చెప్పింది. 440 మందికి దగ్గర దగ్గరగా అంటే 430, 439.5 మార్కులు వచ్చాయని,  ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన తీవ్రమైన పోటీ పరీక్షల్లో సర్వసాధారణంగా జరుగుతుందని సివిల్ సర్వీసెస్ లో కూడా మార్కులు  దగ్గర దగ్గరగా ఉంటాయని తెలిపింది.  

అదేవిధంగా  18, 19  పరీక్షా కేంద్రాలలో సుమారు 1,656 మహిళా అభ్యర్థుల్లో 76 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. సుమారు 1,656  మంది మహిళా అభ్యర్థుల్లో 563 ఉద్యోగాలకు 500 మందో, 400 మందో ఆ రెండు పరీక్షా కేంద్రాల నుంచి ఎంపికైతే అనుమానం వ్యక్తం చేయాలి.  కానీ, 1,656  మందికి 76మంది ఎంపిక కావటం అనేది సహజ  ప్రక్రియగా చూడాలి.  

ఏది ఏమైనప్పటికీ రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు.  దయచేసి తెలంగాణ నిరుద్యోగులు ఇది గమనించాలి.  తెలంగాణలో తొలి గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాకుండా బీఆర్ఎస్  చేస్తున్న కుట్రలను తిప్పికొట్టండి.  అక్టోబర్  నెలలో జాబ్ క్యాలెండర్  ద్వారా  భర్తీ  జరిగే  సుమారు 40 వేల ఉద్యోగాలకు ఇప్పటి నుంచే ఏకాగ్రతతో చదివి విజేతలు కావాలని రాష్ట్ర నిరుద్యోగులను కోరుతున్నాను.

హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో సవాలు

హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మూల్యాంకనంలో తెలుగు మాధ్యమం,  ఆంగ్ల మాధ్యమం అభ్యర్థుల మధ్య మార్కుల వ్యత్యాసం ఉందన్న  పిటీషనర్ల  వాదనలతో ఏకీభవించింది.  టీజీపీఎస్సీ వాదనలను తోసిపుచ్చింది. పునర్ మూల్యాంకనం చేయాలి లేకుంటే మెయిన్స్ రద్దు చేసి తిరిగి మళ్లీ నిర్వహించాలి అనే తీర్పును మంగళవారం హైకోర్టు వెలువరించింది.  ఆ తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో సవాలు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ  వెల్లడించింది.  

గ్రూప్ 1లో విజేతలుగా నిలిచిన 563 మంది అభ్యర్థులు మాత్రం  మేం నిజాయితీగా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాం.  మేం సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతూ  గ్రూప్ 1లో విజయం సాధించాం.  మాలో  ఎక్కువ మంది గ్రూప్ 2, 3 ఉద్యోగాల్లో కూడా విజేతలుగా నిలిచారు.  మాలో  కొంత మంది ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకి రాజీనామా చేసి ప్రిపేర్​ అయి గ్రూప్ 1కు ఎంపికయ్యారు.  మా నిజాయితీని పరీక్షించండి అని వారు కూడా హైకోర్టు తీర్పును హైకోర్టు ధర్మాసనంలో సవాలు చేస్తున్నట్లు సమాచారం.  

- కోటూరి మానవతా రాయ్,టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి-