స్వరాష్ట్రంలో మంగలన్నకు ఒరిగిందేమిటి ?

స్వరాష్ట్రంలో మంగలన్నకు ఒరిగిందేమిటి ?

సమైక్య ఆంధ్రప్రదేశ్లో నీళ్లు, నిధులు, నియమాకాలు దోపిడీకి గురయ్యాయి. సబ్బండ వర్గాలు, సకల జనులు మిళితమై ఉధృతమైన పోరాటాన్ని నిర్విరామంగా చేసి స్వంత రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆనాటి టీఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమంలో అమరుల త్యాగం కీలకమైంది. ఆంధ్రప్రదేశ్ పాలకుల కారణంగా విస్మరించిన కొన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి తెలంగాణలో బాటలు పడతాయనే ఆశలు ఆ ఉద్యమంలో బలంగా చిగురించాయి. కానీ, అలా జరగలేదు.

రాజకీయంగా అంటరాని కులాలుగా చూస్తున్న సేవా వృత్తి కులాలైన చాకలి, మంగలి, కుమ్మరి, గంగిరెద్దు, బైల్ కమ్మరి లాంటి చాలా కులాలకు ఒరిగిందేమీ లేదు. వారు తమ ఆత్మ గౌరవ జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎగరేయవచ్చు అనుకున్నారు. సకల జనుల సమ్మెను జయప్రదం చేశారు. కానీ, ఉమ్మడి రాష్ట్రం నుంచి  నేటివరకు సేవా కులాలు, సంచార, తదితర కింది స్థాయి కులాల ఆశలు నెరవేరలేదు. వారికి రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదు. వివిధ పథకాల్లో ప్రాధాన్యత లభించలేదు.

ఆర్థిక స్థోమత లేక..
బీసీల్లో  మంగలి లేదా నాయి కులం వారు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నారన్న సాకు చూపి రాజకీయంగా చిన్న చూపు చూస్తున్నారు.  సామాజికంగా వారి పట్ల వివక్ష అలాగే కొనసాగుతోంది. ఆ కుటుంబాల్లో పెద్దదిక్కు ఒక్కరే వృత్తిని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. వారిలో భూములుగలవారు నామమాత్రం. నిజాం కాలంలో  హజా/మంగలికి గ్రామంలో కొంత భూమిని ఇనాం కింద ఇచ్చినా పేదరికం కారణంగా ఆ భూములు వారి చేతుల్లో లేవు. ఆర్థిక స్థోమత లేక ఆ పిల్లలు ప్రభుత్వ బడులలో అరకొర విద్యను అభ్యసించి కాలేజీ దాకా రాకుండానే డ్రాప్​ అవుతున్నారు. కింద కులాల అభ్యున్నతిని కోరుకోనివారు. కులవృత్తి మానకురా గువ్వల చెన్నా లాంటి సామెతలతో వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. చదువుకొని  రాజ్యాలేలుతారా అని హేళన చేస్తున్నారు.

పరిపాలన ఆధిపత్య కులాల హక్కు అన్న భావన బలంగానే  ఇప్పటికీ  కొనసాగుతోంది. మరోవైపు నుంచి సంపన్నులు క్షురకుల పొట్టగొడుతున్నారు. సెలూన్లపై భారీ పెట్టుబడులు పెట్టి గిరాకీని తమవైపునకు రప్పించుకొంటున్నారు. పేద,  తక్కువ కులం అన్న ముద్ర యధావిధిగా కొనసాగుతున్నా  వృత్తి మాత్రం వారి చేతుల్లో నుంచి వేగంగా జారిపోతోంది. తాతల నాటి ఇరుకు ఇండ్లలో వారు బతుకుతున్నారు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాల్లో వారికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. మంగలికి మరో వృత్తి ప్రసూతి సేవలు, శిశువుల మసాజ్ స్నానాలు, బ్యాండు మేళాలు వగైరా ఉన్నా వాటి ద్వారా లభించే ఆదాయం కూడా నామ మాత్రమే. వాటిలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ.

అందని ద్రాక్షగా.. రాజకీయ ప్రాతినిధ్యం
సొసైటీలను కూడా పక్కన పడేశారు. అందరికీ రాజకీయ ప్రాతినిధ్యం సామాజిక న్యాయం అందని  ద్రాక్షపళ్లే అయ్యాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా నేడు మంగలి/ నాయి, రజక/ చాకలి, కుమ్మరి/శాలివాహన, కులాలకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోంది.  శెక్కుడు సంచి ఉందిగాని అండ్ల చిల్లిగవ్వ లేదన్నట్టు ఉంది ఈ కులాల స్థితి. కేసిఆర్​కు, రేవంత్ రెడ్డికి ఈ విషయంలో తేడా లేదు. స్వాతంత్ర్యానికి ముందు కూడా ఇదేతంతు ఇప్పుడూ ఇదేతంతు  కొనసాగుతోంది.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా సేవా వృత్తి కులాల వారిని ఏమార్చుతున్నారంతే.

నాగర్ కర్నూల్ జిల్లాల్లో రజక, దళిత దంపతుల శిశివు ఆధిపత్య వర్గాల వారు కర్కశంగా చంపేసినా  ప్రభుత్వానికి పట్టలేదు.  కులాంతర పెండ్లి చేసుకొన్న కింది కులాల వారి హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్థితి మారాలి. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి. క్షౌరవృత్తి సెలూన్లకు కరెంట్ ఉచితంగా ఇవ్వాలి. సెలూన్లు, లాండ్రీలు పెట్టుకొనేందుకు ప్రభుత్వం పల్లెల్లో  కూడా రుణాలివ్వాలి. దినాల సందర్భంగా స్మశానాల దగ్గర తలగొరగడానికి షెడ్లు గద్దెలు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి.  స్థానిక సంస్థల్లో ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించాలి. సేవా కులాల, వృత్తి కులాల విద్యార్థులకు స్కాలర్​షిప్​లు ఇవ్వాలి.  

 కొత్తపల్లి అభినాష్ మంగళ టీకేవీఎస్, ఉపాధ్యక్షుడు, తెలంగాణ

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.