శభాష్.. బర్రెలక్క .. నిరుద్యోగుల గొంతుకగాఅసెంబ్లీ బరిలో శిరీష

శభాష్..  బర్రెలక్క .. నిరుద్యోగుల గొంతుకగాఅసెంబ్లీ బరిలో శిరీష
  • ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, పైసల్లేకున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు.. 
  • బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గని నైజం  
  • వివిధ వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు 
  • ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్
  • కొల్లాపూర్ సెగ్మెంట్​పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ

నాగర్ కర్నూల్, వెలుగు: ఈసారి ఎన్నికల్లో నాగర్​కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిరుద్యోగి కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పోటీ చేయడమే. ఎలాంటి పొలిటికల్​బ్యాక్​గ్రౌండ్​లేని ఆమె.. నిరుద్యోగుల గొంతుకగా ఎన్నికల బరిలో నిలిచింది. పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తామని రోజూ వందలకొద్దీ బెదిరింపులు​వస్తున్నా ధైర్యంతో ముందుకెళ్తున్నది.

రెండ్రోజుల కింద తన తమ్ముడిపై దాడి జరిగినా వెనక్కి తగ్గేది లేదని, పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ శిరీషకు నిరుద్యోగులతో పాటు ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. బర్రెలక్కకు ఓటు వేయాలని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కోరుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఆమె ఎవరి ఓట్లు చీలుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 

బర్రెల వీడియోతో పాపులర్..

కొల్లాపూర్​ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష(26) తల్లి రోజువారీ కూలీ. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి వీళ్లకు దూరంగా ఉంటున్నాడు. శిరీష ఓపెన్​డిగ్రీ చేస్తూనే కుటుంబానికి ఆసరాగా ఉండాలని నాలుగు బర్రెలు కొనుక్కుంది. వాటిని మేపుతూ వీడియోలు చేసి సోషల్​మీడియాలో పోస్ట్​చేసేది. ‘‘హలో ఫ్రెండ్స్.. ఎంత చదివినా ఉద్యోగాలు వస్తలేవ్​.. అందుకే నాలుగు బర్లను కొనుక్కున్న.. పాలమ్మితే రోజుకు మూడు వందలు ఎక్కడికిపోవు’ అంటూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఆమె చేసిన వీడియో సోషల్​మీడియాలో మస్తు వైరల్ అయింది. ఆ తర్వాత వివిధ సమస్యలపై వీడియోలు చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని బర్రెలక్కగా ఫేమస్ అయింది.

డిగ్రీ పూర్తయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో బర్రెలను అమ్ముకున్న శిరీష.. హైదరాబాద్​కు వెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. నోటిఫికేషన్​పడిన ప్రతి పోస్టుకూ అప్లయ్​చేసింది. అయితే క్వశ్చన్​పేపర్ల లీకేజీలు, పరీక్షల వాయిదాలతో విసిగిపోయి తిరిగి ఊరికి వచ్చేసింది. తల్లితో కలిసి ఫాస్ట్​ఫుడ్​సెంటర్​ఓపెన్​చేసి, తమ్ముళ్లను చదివించుకుంటోంది. రాని సర్కారీ నౌకరి కోసం జీవితాలను ఎందుకు బలి చేసుకోవాలని ప్రశ్నించే శిరీష.. అసెంబ్లీ ఎన్నికలే సరైన వేదిక అని నిర్ణయించుకుని, కొల్లాపూర్ నుంచి నామినేషన్​వేసింది. మొన్నటి దాకా తమాషాకు వీడియోలు చేస్తుందనుకున్న అమ్మాయి.. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలో నిలవడం, బెదిరింపులకు లొంగకుండా హేమాహేమీలతో తలపడ్తుండడంతో ఇప్పుడు రాష్ట్రమంతా బర్రెలక్క వైపు చూస్తోంది.  

రూ.6,500తో ప్రచారానికి.. 

ప్రచారం కోసం అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ శిరీష తన చేతిలో ఉన్న రూ.6,500తో ప్రచారం మొదలుపెట్టింది. బ్యాంక్​అకౌంట్ లో రూ.1,500, చేతిలో  రూ.5 వేలు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొంది. నిరుద్యోగ సమస్యపై సోషల్​మీడియాలో పోస్ట్​చేసిన వీడియోకు సంబంధించి ఒక కేసు నమోదైనట్టు తెలిపింది. తనకు ఎలాంటి ఆస్తులు, వెహికల్స్ లేవని వెల్లడించింది.

శిరీషకు ఇన్​స్టాగ్రామ్ లో 5.73 లక్షల మంది, ఫేస్​బుక్​లో 1.07లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్​లో 1.59 లక్షల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఆమెకు ‘విజిల్’ గుర్తు​కేటాయించగా.. గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, విద్య, వైద్య రంగాల దుస్థితి తదితర అంశాలను ప్రస్తావిస్తోంది. ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా ప్రకటించింది. కాగా, బెదిరింపులు, దాడుల నేపథ్యంలో బర్రెలక్కకు సెక్యూరిటీ కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

పరీక్షలు సక్కగా నిర్వహించలేని  ప్రభుత్వాలు ఎందుకు?: బర్రెలక్క

ఎన్నికల్లో పోటీ చేయాలనేది తన సొంత నిర్ణయమని బర్రెలక్క (శిరీష) తెలిపారు. ఆమె గురువారం ‘వెలుగు’తో మాట్లాడారు. ‘‘దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాడుతున్నరు. అప్పులు చేసి కుటుంబాలకు భారంగా మారి హైదరాబాద్​ కోచింగ్​సెంటర్లలో ఉండి తిప్పలు పడుతున్నరు. వారి బాధలు చెప్పడానికి మాటలు సరిపోవు. ఈరోజు కాకుంటే రేపు లేదా ఎల్లుండైనా మంచిగుంటదనే నమ్మకం లేదు. ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించారా? పరీక్షలు సక్కగా రాయకపోతే ఫెయిల్​చేస్తరు. అసలు పరీక్షలే సక్కగా పెట్ట   లేని ప్రభుత్వాలను ఏం చేయాలి. ఎమ్మెల్యేలుగా గెలిస్తే మంత్రులుగా ప్రమోషన్​ఇస్తరు. లేకుంటే కార్పొరేషన్​ చైర్మన్​పదవులు ఇస్తరు. మరి నిరుద్యోగులు ఏజ్​బార్​అయ్యే వరకు పరీక్షలు రాయనీకే పోటీ పడుతున్నరు. ఉద్యోగాలు సంపాదించుకునేందుకు కాదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు?” అని శిరీష ప్రశ్నించారు. 

మస్తు స్పందన వస్తున్నది.. 

తనకు జనం నుంచి మంచి స్పందన వస్తున్నదని శిరీష తెలిపారు. ‘‘నా దగ్గర డబ్బు లేదు. అందుకే చాలామంది చందాలు ఇస్తున్నారు. నేను పైసలు పంచను. మందు పొయ్యను. కానీ జనాలు వచ్చి, నేను చెప్పింది శ్రద్ధగా వింటున్నారు. ‘నువ్వు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే’ అని అంటున్నారు. ప్రతి స్టేట్​నుంచి నిరుద్యోగ సోదరులు కూడా వచ్చి, నాకు సపోర్ట్​ చేస్తున్నారు. చాలామంది ఫోన్లు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతిచ్చారనే కోపంతో ఒకరిద్దరి ఉద్యోగాలు పోయేలా చేశారు. మాపై ఎందుకింత కక్ష. మేము వాళ్ల అధికారం, ఆస్తుల్లో వాటాలు అడుగుతలేం. బర్రెలక్క ఒక్కతే పోటీ చేస్తే ఏం జరగదు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగుల సమస్య. మా నిరుద్యోగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎన్నికల్లో పోటీ చేయాలె. వాళ్ల ఇంటి నుంచే పోరాటం మొదలు కావాలె” అని పిలుపునిచ్చారు. 

నేనంటే ఎందుకంత భయం.. 

తాను పోటీ చేస్తే, వివిధ పార్టీల లీడర్లు ఎందుకంత భయపడుతున్నారని శిరీష ప్రశ్నించారు. ‘‘కొందరు నన్ను చంపుతానని బెదిరిస్తున్నరు. మా తమ్ముడిపై దాడి పక్కా ప్లాన్​ప్రకారం జరిగింది. పొలిటికల్ పార్టీల లీడర్లకు అంత భయం ఎందుకో అర్థమైతలేదు. నాలుగు బర్రెలు కాసుకునే శిరీషను చూసి ఎందుకు భయపడుతున్నరో చెప్పాలి” అని అన్నారు. ‘‘ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో చెప్పాలి. జాబ్​క్యాలెండర్​ఇవ్వాలి. పేపర్లు అమ్ముకోకుండా షెడ్యూల్​ప్రకారం పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు కుక్కలకు బొక్కలేసినట్లు మాకు ఆశచూపించుడు కాదు. మా ఉద్యోగాలు మాకు ఇయ్యాల్సిందే. ఇదే నా మేనిఫెస్టో” అని చెప్పారు.

ప్రాణం పోయినా పోరాటం ఆపను

కొల్లాపూర్/నాగర్​కర్నూల్​టౌన్, వెలుగు:  ప్రాణం పోయినా తన పోరాటం ఆపనని కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష అలియాస్​ బర్రెలక్క స్పష్టం చేశారు. ప్రముఖ అడ్వకేట్లు కావేటి శ్రీనివాస్ రావు, కరణం రాజేశ్ గురువారం కొల్లాపూర్​లో శిరీషను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శిరీష మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నామినేషన్ వేసినప్పటి నుంచి రోజూ ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. బయటకు చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్నారు.

నాకు సపోర్టుగా నిలబడినవారినీ బెదిరిస్తున్నారు. కొందరి ఉద్యోగాలు తీసేయించారు. నిరుద్యోగుల వాయిస్​గా, లోకల్​ఇష్యూస్​ను హైలైట్ చేసేందుకు, పేదలకు మంచి చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నన్ను బెదిరించిన ప్రతి ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఎన్నికల తర్వాత వెల్లడిస్తాను. నన్ను చంపినా వెనకడుగు వేయను. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు అందరితో కలిసి పోరాడుతాను’’ అని చెప్పారు.

బర్రెలక్క తమ్ముడిపై దాడి చేయడం సిగ్గుచేటని అడ్వకేట్లు కావేటి శ్రీనివాస్ రావు, కరణం రాజేశ్ అన్నారు. అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం బర్రెలక్కకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థికి రక్షణ కల్పించాల్సిన ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బర్రెలక్కను టచ్ చేయాలంటే, ముందు లాయర్లను టచ్ చే యాలని సవాల్ విసిరారు. దాడికి పాల్పడిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. శిరీష పోటీ చేయడంతో రాజకీయ పార్టీలకు మింగుడుపడటం లేదన్నారు. అనంతరం అడ్వకేట్లు, మద్దతుదారులు, సీనియర్​జర్నలిస్ట్​ పాశం యాదగిరితో కలిసి తనకు సెక్యూరిటీ కల్పించాలని అడిషనల్​ఎస్పీ రామేశ్వర్​కు శిరీష వినతి పత్రం ఇచ్చారు. 

ALSO READ : స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టాలి : దీపక్​ మిశ్రా

భద్రత కల్పించాలని  హైకోర్టులో పిటిషన్

తన తమ్ముడిపై రెండ్రోజుల కింద దాడి జరిగిందని, తన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో 2ప్లస్‌2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టనున్నారు.