బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్లు ఆందోళన బాట

బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్లు ఆందోళన బాట

నిర్మల్/బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్లు ఆందోళన బాట పట్టారు. వేసవి సెలవుల తర్వాత క్యాంపస్‌‌లో అడుగుపెట్టిన స్టూడెంట్లకు సమస్యలు స్వాగతం పలకడంతో ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం టిఫిన్ చేయకుండానే క్లాసులను బహిష్కరించారు. క్యాంపస్‌‌లోని అకడమిక్ బ్లాక్ ఎదుట ‘స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో బైఠాయించారు. దాదాపు 4 వేల మందికి పైగా విద్యార్థులు క్యాంపస్‌‌లో ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై నిరసన తెలిపారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. వీరి ఆందోళన రాత్రి దాకా కొనసాగింది. ఉదయం స్టూడెంట్ల ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా క్యాంపస్‌‌కు చేరుకున్నారు. క్యాంపస్ ముందు మోహరించి, ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతో పాటు స్టూడెంట్ల తల్లిదండ్రులకూ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతలు అక్కడికి వచ్చి తమను క్యాంపస్‌‌లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పంపకపోవడంతో నేతలంతా క్యాంపస్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కళ్లుగప్పి లోనికి బల్మూరి

ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ఎన్ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్.. క్యాంపస్‌‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో క్యాంపస్ వెనుక వైపు నుంచి గోడ దూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెగ్యులర్ వీసీని నియమించాలని, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని, నాణ్యమైన ఆహారం, మంచినీరు, విద్యార్థులకు ల్యాప్​టాప్​లు, యూనిఫామ్స్ అందించాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌‌లోకి వెంకట్ వెళ్లిన విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకొని భైంసా పోలీస్‌‌ స్టేషన్‌‌కు తరలించారు.

స్పందించని ఆఫీసర్లు

స్టూడెంట్ల ఆందోళనపై ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయ నాయకులు మండిపడ్డారు. స్టూడెంట్లు ధర్నా చేస్తున్నా సమస్యల పరిష్కారానికి ఆఫీసర్లు ముందుకు రాకపోవడం అన్యాయమని పేరెంట్స్​అన్నారు. సమస్యలను  పరిష్కరించాల్సిన అధికారులు.. ఎన్నడూ పట్టించుకోకపోవడం వల్లే ఇలా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.

నీళ్లు ఉండవు.. ఫుడ్‌‌లో పురుగులు

ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులు ఫోన్ల ద్వారా మీడియాతో మాట్లాడారు. తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని, ఫుడ్‌‌లో పురుగులు వస్తున్నాయని, రోజుల తరబడి నీళ్లు ఉండటం లేదని, కరెంట్ సప్లై జరగడం లేదని చెప్పారు. సమస్యలపై మీడియాకు సమాచారం అందించే వాళ్లను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల గురించి ఎన్నిసార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. క్యాంపస్‌‌లో ఇంటర్‌‌‌‌నెట్ నిలిపేశారని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలని, డైరెక్టర్, ఫైనాన్స్ ఆఫీసర్‌‌‌‌తోపాటు సరిపడా ఫ్యాకల్టీని నియమించాలని డిమాండ్ చేశారు.