వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవట్లే

వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవట్లే
  • బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల ఆందోళనను పట్టించుకోని సర్కార్ 
  • వారం రోజులుగా విద్యార్థుల పోరాటం
  • ఎనిమిదేండ్ల నుంచి రెగ్యులర్ వీసీ లేని పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో సమస్యలను పరిష్కరించాలంటూ స్టూడెంట్లు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా.. సర్కార్ పెద్దలు పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ వర్సిటీ ఇంచార్జ్ వీసీ రాహుల్ బొజ్జా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వర్సిటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వీరిద్దరూ హైదరాబాద్​లోనే ఉంటూ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. మరోపక్క విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో వర్సిటీకి సెలవులు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీంతో స్టూడెంట్లను బలవంతంగా ఇండ్లకు పంపించే పనిలో యూనివర్సిటీ వర్గాలు ఉన్నాయి.  

సమస్యలకు నిలయంగా ఆర్జీయూకేటీ 

బాసరలోని ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) సమస్యలకు నిలయంగా మారింది. దాదాపు 8 వేల మంది చదువుతున్న వర్సిటీకి 8 ఏండ్ల నుంచి రెగ్యులర్ వీసీని నియమించలేదు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్ బొజ్జాకు ఇంచార్జ్ వీసీగా 2020 ఫిబ్రవరి 26న బాధ్యతలు అప్పగించారు. ఇతర బాధ్యతల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన రెండున్నరేండ్లలో వర్సిటీకి ఒక్కసారి మాత్రమే వచ్చారు. దీంతో ఇన్​చార్జ్ వీసీ ఉండటం వల్లే  సమస్యలు పెరిగిపోతున్నాయని, రెగ్యులర్ వీసీని నియమించాలంటూ ఈ నెల 14 నుంచి విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.

క్లాసులు బహిష్కరించి, నిరసనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలూ మద్దతు ప్రకటించాయి. ఈ నెల15న హైదరాబాద్​లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ తదితరులు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. స్టూడెంట్లు పెట్టిన 12 డిమాండ్లలో ఏ ఒక్కటీ ఆచరణ సాధ్యం కావని స్వయంగా మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి ప్రకటించారు. అవన్నీ సిల్లీ డిమాండ్లంటూ సబితారెడ్డి కామెంట్ చేశారు. అవి చిన్న డిమాండ్లే అయితే ఎందుకు పరిష్కరించడం లేదని స్టూడెంట్లు ప్రశ్నిస్తున్నారు.    

వర్సిటీకి సెలవులు?  

విద్యార్థులు ఆందోళన విరమించకపోవడంతో సర్కారు కొత్త ఎత్తుగడ వేస్తోంది. వర్సిటీకి 10–15 రోజులు సెలవులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిగినా, స్టూడెంట్లు ఆందోళన విరమిస్తారనే భావనతో దానిపై అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. అయితే ఆందోళన రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండటంతో వర్సిటీకి ఒకటి, రెండ్రోజుల్లోనే సెలవులు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే పీయూసీ స్టూడెంట్లను బలవంతంగా ఇంటికి పంపిస్తుండగా.. పేరెంట్స్ లేకుండా ఎలా పంపిస్తారని స్టూడెంట్లు ప్రశ్నిస్తున్నారు.