బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లపై అయోమయం!..ఎల్కతుర్తి, మహబూబ్ నగర్  క్యాంపస్​లపై స్పష్టత కరువు

బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లపై అయోమయం!..ఎల్కతుర్తి, మహబూబ్ నగర్  క్యాంపస్​లపై స్పష్టత కరువు
  • టెన్త్  ఫలితాలు వచ్చి వారం దాటినా రిలీజ్  కాని నోటిఫికేషన్
  • మెరిట్  స్టూడెంట్లకు గాలమేస్తున్న కార్పొరేట్  కాలేజీలు 
  • ఇప్పటికే ఇంటర్, ఏపీ ఆర్జీయూకేటీ అడ్మిషన్  షెడ్యూల్ 

హైదరాబాద్, వెలుగు:బాసరలోని రాజీవ్‌‌‌‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌(ఆర్జీయూకేటీ) అడ్మిషన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 2025–26 విద్యా సంవత్సరంలో మరో రెండు అనుబంధ క్యాంపస్ లను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తుండగా, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే టెన్త్  రిజల్ట్స్​ వచ్చి వారం దాటినా.. ఆర్జీయూకేటీ బాసర అడ్మిషన్  నోటిఫికేషన్  మాత్రం రిలీజ్ కాలేదు. మరోపక్క ఇంటర్  అడ్మిషన్ల షెడ్యూల్  రిలీజ్ కావడంతో, కార్పొరేట్  కాలేజీలు మెరిట్  స్టూడెంట్లకు గాలం వేసే పనిలో పడ్డాయి.

అనుబంధ క్యాంపస్ లపై నో క్లారిటీ..

గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్  విద్యను అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 2008లో బాసరలో ఆర్జీయూకేటీని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్  బీటెక్  కోర్సును కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వర్సిటీలో ఏటా1,500 మంది స్టూడెంట్లకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. అయితే, ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ బాసరలోని ఒకే క్యాంపస్​లో క్లాసులు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం అనుబంధ క్యాంపస్​లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు.

కాంగ్రెస్  సర్కారు కూడా నాలుగు చోట్ల క్యాంపస్​లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో రెండు చోట్ల క్యాంపస్​లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తితో పాటు మహబూబ్ నగర్‌‌‌‌‌‌‌‌ లో ఆర్జీయూకేటీ క్యాంపస్​లను ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై ప్రొఫెసర్లు హుస్సేన్, గోవర్ధన్​తో హయ్యర్ ఎడ్యుకేషన్  అధికారులు కమిటీ వేయగా, ఆ కమిటీ రిపోర్టు ఇటీవల సర్కారుకు చేరింది. ఈ ద్విసభ్య కమిటీ కూడా క్యాంపస్ లు ఏర్పాటు చేయాలని సూచించింది. 

ఆ నిర్ణయంతోనే నోటిఫికేషన్..

ఆర్జీయూకేటీ అడ్మిషన్  నోటిఫికేషన్  కోసం వర్సిటీ అధికారులు మూడు నెలల క్రితమే సర్కారుకు పర్మిషన్​ కోసం లెటర్​ పంపించారు. కొత్త క్యాంపస్​లపై స్పష్టత రాకపోవడంతో షెడ్యూల్  రిలీజ్ ను విద్యాశాఖ పక్కనపెట్టింది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎల్కతుర్తి, మహబూబ్ నగర్​లో ఒక్కో క్యాంపస్​ను తొలి ఏడాది 250 సీట్లతో ప్రారంభించాలని భావిస్తున్నారు. కొత్తగా భవనాలు నిర్మించేంత వరకు అద్దె భవనాల్లో కొనసాగించాలని యోచిస్తున్నారు. ఒకవేళ రెండింటినీ ప్రారంభిస్తే.. బాసరలో 1,500 సీట్లతో పాటు ఆ రెండు క్యాంపస్​లతో కలిపి 2వేల సీట్లకు నోటిఫికేషన్  ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు క్యాంపస్​లపై సర్కారు నిర్ణయం తీసుకుంటేనే, నోటిఫికేషన్​పై స్పష్టత రానుంది.

మెరిట్ స్టూడెంట్లకు గాలం..

టెన్త్ ఫలితాలు వచ్చి వారం దాటింది. మరోపక్క ఇంటర్  అడ్మిషన్  షెడ్యూల్​ కూడా రిలీజ్ అయింది. దీంతో కార్పొరేట్  కాలేజీలు సర్కారు స్కూళ్లలోని మెరిట్  స్టూడెంట్లకు గాలం వేసే పనిలో పడ్డాయి. ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ పేరెంట్స్ వెంటపడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది వారి వలలో పడి కొంత ఫీజులు కూడా  కట్టేశారు. అయితే, బాసర ట్రిపుల్  ఐటీలో సీట్లు వస్తే.. కట్టిన ఫీజు రాకపోగా, ఆ ఏడాది ఫీజు మొత్తం కట్టాలని ఒత్తిడి చేసిన ఘటనలు గతంలో జరిగాయి. మరోపక్క ఏపీ ఆర్జీయూకేటీ అడ్మిషన్  నోటిఫికేషన్  రావడంతో పేరెంట్స్, స్టూడెంట్లు బాసర ఆర్జీయూకేటీ నోటిఫికేషన్  కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాంపస్​లపై నిర్ణయం తీసుకోని నోటిఫికేషన్  రిలీజ్  చేయాలని పేరెంట్స్  కోరుతున్నారు.