బాసర మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు : దేవాదాయ శాఖ కమిష నర్ హను మంత రావు

బాసర మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు : దేవాదాయ శాఖ కమిష నర్ హను మంత రావు
  •     దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

నిర్మల్, వెలుగు: శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ ను పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఆదివారం నిర్మల్​జిల్లాలోని ప్రముఖ దేవస్థానం బాసరలోని అమ్మవారి ఆలయాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి కమిషనర్ సందర్శించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ అమలుపై కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 

రూ.225 కోట్లతో చేసే అభివృద్ధి పనులతో ఆలయ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. బాసర క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని కలెక్టర్​పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.