ఇకపై 24 గంటలు ఆందోళనలు

ఇకపై 24 గంటలు ఆందోళనలు
  • ఇకపై 24 గంటలు ఆందోళనలు
  • రాత్రి వేళల్లో క్యాంపస్​ మెయిన్​ రోడ్​పై దీక్షలు
  • బాసర ట్రిపుల్ ఐటీ  స్టూడెంట్ల నిర్ణయం 
  • 10 వేల మంది పూర్వవిద్యార్థుల మద్దతు 
  • నేటి నుంచి నిరసనలో పాల్గొంటామని వెల్లడి 
  • క్యాంపస్​కు సెలవులు ప్రకటించాలని సర్కార్ యోచన

భైంసా/బాసర, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు పట్టువీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆదివారం యోగా చేస్తూ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం వచ్చి హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఆరు రోజులుగా క్యాంపస్ లోపల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేస్తున్న స్టూడెంట్లు.. ఇకపై రాత్రి కూడా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి 24 గంటలు నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళల్లో క్యాంపస్​లోని ప్రధాన రోడ్డుపై దీక్షలు కొనసాగించనున్నారు. మరోవైపు స్టూడెంట్ల ఆందోళనకు పూర్వ విద్యార్థులు మద్దతు ప్రకటించారు. 10 వేల మంది పూర్వ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలో పాల్గొంటారని స్టూడెంట్ గవర్నింగ్​ కౌన్సిల్ సభ్యుడు మాదేశ్ చెప్పారు. 


ఇప్పటికే స్టూడెంట్లకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన పూర్వ విద్యార్థులు.. సమస్యలన్నీ పరిష్కారమయ్యేంత వరకూ ఆందోళన విరమించవద్దని సూచిస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న స్టూడెంట్లు అనారోగ్యానికి గురవుతున్నారు. వానలో తడవడం, అలసిపోవడంతో కొందరు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆదివారం క్యాంపస్ వీడి ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం ఏబీవీపీ నాయకులు వర్సిటీకి రాగా, పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 


ఉద్యమాన్ని నీరుగార్చే ప్లాన్.. 

 

2017, 2018లోనూ స్టూడెంట్లు ఆందోళన చేయగా.. అప్పుడు ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేర్చలేదు. దీంతో మంత్రులు, అధికారులు వచ్చి హామీలు ఇచ్చినా స్టూడెంట్లు ఆందోళన విరమించడం లేదు. దీనిపై సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. రెండు మూడ్రోజుల్లో మరోసారి స్టూడెంట్లతో చర్చలు నిర్వహించి, వినకపోతే సెలవులు ప్రకటించాలని యోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ క్యాంటీన్ హెచ్​వోడీ శాస్త్రి కూడా రెండ్రోజుల క్రితం విద్యార్థులను హెచ్చరిస్తూ సెలవుల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారని చెప్తున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే సెలవుల అంశాన్ని తెరపైకి తెచ్చిందంటున్నారు.