న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపు వల్ల దేశంలో అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్ర ఆర్థిక శాఖ ఎక్సైజ్ డ్యూటీని సవరించింది. వెయ్యి సిగరెట్లపై పొడవును బట్టి రూ.2,050 నుంచి రూ.8,500 వరకు పన్ను విధిస్తారు. ఇది 40 శాతం జీఎస్‍టీకి అదనం. దీనివల్ల మొత్తం పన్ను భారం 60 నుంచి 70 శాతం వరకు పెరుగుతుంది.
థింక్ చేంజ్ ఫోరం సెక్రటరీ జనరల్ రంగనాథ్ తన్నీర్ మాట్లాడుతూ, అధిక పన్నుల వల్ల వినియోగదారులు చౌకగా దొరికే స్మగ్లింగ్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో అక్రమ పొగాకు మార్కెట్ 26 శాతంగా ఉంది. జేపీ మోర్గాన్, నోమురా వంటి సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అధిక పన్నుల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తాయని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
