తల్లాడ, వెలుగు : రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్బంగా తల్లాడ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో జనవరి 1 నుంచి 31 వరకు ప్రభుత్వం రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మద్యం సేవించి, వేగంగా వాహనం నడపడం, మొబైల్ వాడకం, త్రిపుల్ రైడింగ్ లాంటివి ప్రమాదాలకు కారణాలని వివరించారు. వాహనదారుడికి హెల్మెట్, సీట్ బెల్ట్, సిగ్నల్స్, వేగ పరిమితి, సరైన డాక్యుమెంట్లు తప్పనిసరి అని, ప్రతి పౌరుడు నియమాలు పాటించడమే కాకుండా, రోడ్డుపై ఇతరుల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ రెండవ ఎస్సై బి.వెంకటేష్, నాయకులు, వాహనదారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
