బాసర నుంచి భద్రాచలం దాకా.. ముంచెత్తిన గోదావరి!

బాసర నుంచి భద్రాచలం దాకా.. ముంచెత్తిన గోదావరి!
  • నదీ తీర గ్రామాల్లో క్షణక్షణం భయం
  • బాబ్లీ, విష్ణుపురి, గైక్వాడ్​, ఇతర ప్రాజెక్టుల నుంచి  భారీగా వరద 
  • ఎస్సారెస్పీకి 4.75 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో
  • సురక్షిత ప్రాంతాలకు ముంపు  గ్రామాల ప్రజల తరలింపు

నిజామాబాద్, వెలుగు: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పోటెత్తుతోంది. మహారాష్ట్రలోని గైక్వాడ్, విష్ణుపురి, బాలేగావ్, బాబ్లీతో పాటు రాష్ట్రంలోని నిజాంసాగర్, గడ్డెన్న వాగు, కౌలాస్‌ నాలా, లెండి మిగులు జలాలు, కళ్యాణి, సింగీతం, నల్లమడుగు, నల్లవాగు, మంజీరా, హరిద్రా ఉప నదుల నుంచి  వస్తున్న వరదతో  గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి ఎస్సారెస్పీకి 4.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్‌ 39 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 

గ్రామాల్లోకి చేరిన బ్యాక్‌ వాటర్‌

గోదావరిలో వరద ఉధృతి పెరిగిన ప్రతీసారి ఎస్సారెస్పీ నీరు వెనక్కి వస్తుండడంతో పంటలు, గ్రామాలు నీట మునుగుతున్నాయి. ఇప్పటికే 48,429 ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. బోధన్‌ సెగ్మెంట్‌లోని హంగర్గా, మందర్నా, మిట్టాపూర్‌, అల్జాపూర్‌ తో పాటు బాల్కొండ సెగ్మెంట్‌లోని కొడిచర్ల, చాకిర్యాల, సావెల్, తడ్‌పాకల, దోంచందా, గుమ్మిర్యాలకు చేరువలో వరద పారుతోంది. హంగర్గా గ్రామంలోకి  వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 480 మందిని బోధన్‌లోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించగా.. మరికొందరు బంధువుల ఇండ్లలో ఉంటున్నారు. 

అలాగే మందర్నా గ్రామాన్ని వరద చుట్టుముట్టడంతో 430 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డబుల్‌ ఫ్లోర్‌ ఇండ్లున్న కుటుంబాలు గ్రామంలోనే ఉంటున్నాయి. మిగతా వారు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నా రు. నవీపేట మండలం మిట్టాపూర్, అల్జాపూర్‌ చుట్టూ నీరు నిలిచే ఉంది. మందర్నాలో కొందరు జ్వరంతో బాధపడుతుండడంతో బోట్ల సాయంతో మెడికల్‌ టీమ్‌ వెళ్లి వైద్య సేవలు అందించింది. హంగర్గా గ్రామాన్ని శనివారం అడిషనల్‌ కలెక్టర్‌ అంకిత్, సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ట్రైనీ కలెక్టర్‌ కరోలిన్‌ సందర్శించారు.

ఇండ్లలోకి బురద.. తడిసిన సామగ్రి

గోదావరి నది తీర ప్రాంతాల్లోని సిరికొండ, భీంగల్‌, ధర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోకి చేరిన వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో గ్రామస్తులు ఇంటి ముఖం పట్టారు. ఇండ్లలో బురద పేరుకుపోవడం, వస్తువులు పూర్తిగా తడిసిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తడిసిన డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు, వస్తువులను ఆరబెట్టుకుంటున్నారు. ఎంపీ అర్వింద్‌ ఫౌండేషన్‌ తరఫున రైస్‌ బ్యాగ్‌లు, వంట సరుకులు అందజేశారు. 

ఎస్సారెస్పీలో 58 టీఎంసీల నీరు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యాక్‌ వాటర్‌ ఎఫెక్ట్‌ కారణంగా ప్రాజెక్ట్ కు వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదులుతున్నారు.  ఇప్పటివరకు మొత్తం 180 టీఎంసీల నీటిని విడుదల చేశారు.  

 మంచిర్యాలలో టెన్షన్

మంచిర్యాల : గోదావరికి తీవ్రస్థాయి వరదతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టులతో పాటు క్యాచ్ మెంట్ ఏరియా నుంచి వరద పోటెత్తుతుండగా.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 7 లక్షల నుంచి 8 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 40 గేట్లు ఓపెన్ చేసి నీటిని వదులుతున్నారు. నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం వెనుక నుంచి ఎంసీహెచ్ వరకు వరద నీరు చేరింది. ముందు జాగ్రత్తగా 120 మంది పేషెంట్లను మంచిర్యాల జీజీహెచ్ తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. 

మరోవైపు రాళ్లవాగులో వరద వెనక్కి వస్తుండడంతో ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలి కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద ప్రజలను, అధికారులను భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయం కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్న 27 కుటుంబాలను పునరావాస కేంద్రానికి పంపించారు. సాయంత్రం దాకా వరద తగ్గలేదు.  

భద్రాచలం వద్ద నెమ్మదిగా..

భద్రాచలం : గోదావరి వరద భద్రాచలం వద్ద నెమ్మదించింది. మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి 47.40 అడుగుల వద్దనే ఉంది. కాగా.. స్నానఘట్టాలతో పాటు, కల్యాణకట్ట కింద భాగాన్ని ముంచెత్తింది. 11.15 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఎగువన ఉపనదుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉన్నందున వరద తీవ్రతపై స్పష్టత లేదు. మరో రెండు రోజుల పాటు గోదావరి క్యాచ్​మెంట్ ఏరియాలో వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో  అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ఆదేశించారు. ఏపీ విలీన మండలాల్లో సైతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.