బాసర ట్రిపుల్ ఐటీలో పదేండ్ల నుంచి..ఇన్​చార్జీల పాలనే

బాసర ట్రిపుల్ ఐటీలో పదేండ్ల నుంచి..ఇన్​చార్జీల పాలనే
  • స్టూడెంట్లకు వచ్చే సౌకర్యాల్లోనూ కోతపెట్టిన సర్కార్
  • ఆందోళనల సమయంలో ఆర్జీయూకేటీకి వెళ్లిన రేవంత్
  • కొత్త సర్కారుపై ఆశలుపెట్టుకున్న స్టూడెంట్లు, పేరెంట్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ.. ట్రబుల్ ఐటీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్​ నాలెడ్జ్​ టెక్నాలజీస్) గత బీఆర్​ఎస్​ సర్కారు హయాంలో నిరాదరణకు గురైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కనీసం రెగ్యులర్ వైస్ చాన్స్ లర్​, చాన్స్ లర్​ ను నియమించకుండా, వేలాది మంది మెరిట్ విద్యార్థుల భవిష్యత్​ను గాలికి వదిలేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, బాసర ట్రిపుల్ ఐటీ రూపురేఖలు మారుతాయనే ఆశలో స్టూడెంట్లు, పేరెంట్స్ ఉన్నారు. 

డైరెక్టర్ పోస్టు రెండేండ్లుగా ఖాళీ.. 

గ్రామీణ ప్రాంత స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008లో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా బాసరలో ఆర్జీయూకేటీని స్థాపించారు. అప్పట్లో బాసరతో పాటు ఇడుపుల పాయ, నూజివీడు ట్రిపుల్​ఐటీలకూ ఒక్కరే వీసీ ఉండేవారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక  ఓయూ ప్రొఫెసర్​ సత్యనారాయణను ఇన్​చార్జీ వీసీగా సర్కారు నియమించింది. 

ఆ తర్వాత నాటి ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్​ కుమార్ ను, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ రాహుల్ బోజ్జా ఇన్ చార్జీలుగా కొనసాగారు. రెండేండ్ల కింద ఆర్జీయూకేటీలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలతో వర్సిటీ అట్టుడికింది. క్వాలిటీ భోజనం పెట్టాలని, రెగ్యులర్ వీసీ, డైరెక్టర్​ను నియమించాలని వారం రోజుల పాటు క్యాంపస్​లో స్టూడెంట్లు ఆందోళనలు చేశారు. దీంతో నాటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్టూడెంట్లతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

 ఈ క్రమంలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్​ చైర్మన్​గా ఉన్న ప్రొఫెసర్ వెంకటరమణకు ఇన్ చార్జీ వీసీగా, ఓయూ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ను ఏడాది పదవి కాలానికి డైరెక్టర్​గా నియమించింది. అయితే, ఇప్పటికీ వారే కొనసాగుతున్నారు. రెగ్యులర్ అధికారులనూ నాటి సర్కారు నియమించలేదు. వర్సిటీలో కీలకమైన డైరెక్టర్ పోస్టు కూడా రెండేండ్ల నుంచి ఖాళీగానే ఉంది. 

15 మందే రెగ్యులర్ ఉద్యోగులు.. 

వర్సిటీలోని ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో దాదాపు 9వేల మంది చదువుతున్నారు. దీంట్లో పర్యవేక్షణ పోస్టులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీల భారీగానే ఉన్నాయి. వర్సిటీలో కేవలం 15 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీసీ, డైరెక్టర్, ఏవో వంటి కీలకమైన పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మరోపక్క వర్సిటీ యాక్ట్ ప్రకారం చాన్స్ లర్ కీలకం. 

ఈ పోస్టు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఆ పోస్టును సర్కారు నియమిస్తేనే, మిగిలిన పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. అయితే, ఇతర వర్సిటీల మాదిరిగా ట్రిపుల్​ఐటీకి చాన్స్ లర్ గా గవర్నర్ ఉండరు.. ఓ సీనియర్  విద్యావేత్త లేదా పారిశ్రామికవేత్తను నియమించవచ్చు. కానీ, గత 10 ఏండ్ల నాటి బీఆర్ఎస్ సర్కారు ఆ ప్రయత్నం చేయలేదు. దీనికితోడు స్టూడెంట్లకు అందించాల్సిన ఫెసిలిటీస్​ లోనూ కోతపెట్టింది. 

గతంలో అడ్మిషన్ పొందిన ప్రతి స్టూడెంట్​కు ల్యాప్ టాప్ ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం స్టూడెంట్లు చేరిన మూడో సంవత్సరంలో (ఈసీ1) వీటిని ఇస్తున్నారు. అది కూడా సకాలంలో ఇవ్వట్లేదు. మెస్ కాంట్రాక్టును తొలగిస్తామని నాటి మంత్రి  కేటీఆర్ స్టూడెంట్‌‌‌‌లకు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు.

యాక్ట్ మారుస్తరా.. పాతదే కంటిన్యూ చేస్తరా? 

వర్సిటీ పోస్టుల రిక్రూట్మెంట్ పై యూనివర్సిటీ యాక్ట్ ను మార్చేందుకు గత సర్కారు ప్రయత్నం చేసింది. చాన్స్​లర్ సహా వీసీ, గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు బాధ్యత సర్కారుకు అప్పగించేందుకు యాక్ట్ లో మార్పులు చేసింది. కానీ, దీనిపై న్యాయ సమస్యలు ఏర్పడుతుండటంతో పక్కన పెట్టేశారు. 2018లో ఈ వర్సిటీని ఇతర వర్సిటీల మాదిరిగా కన్వర్ట్ చేసేందుకు ఓయూ మాజీ వీసీ సులేమాన్ సిద్ధిఖీ నేతృత్వంలో కమిటీ వేసినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. 

2021లో అన్ని వర్సిటీలతో పాటు ఆర్జీయూకేటీకి చాన్స్​ లర్, వీసీలను నియమిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో పాత యాక్ట్ నే కంటిన్యూ చేస్తారా లేక యాక్ట్ కు సవరణలు చేస్తారా అనేది త్వరలోనే తేలనుంది. స్టూడెంట్ల ఆందోళన సమయంలో  ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ హోదాలో వర్సిటీలోకి వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడారు. 

అండగా ఉంటామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో కొత్తగా ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ట్రిపుల్ ఐటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే అవకాశం ఉంది. ఈ సమయంలోనే చాన్స్ లర్, వీసీ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.