నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలకు ఇప్పుడిప్పుడే ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరడం.. త్వరగా పరిష్కరిస్తామని అధికారులు చెప్పడం కామన్ అయిపోతున్నాయి. గడువు మించి పోవడంతో మరలా విద్యార్థులు ఆందోళన బాట పట్టాల్సి వస్తోంది. తాజాగా.. మరోసారి విద్యార్థులు నిరసనకు దిగారు. భోజనం చేయకుండా నిరసన చేపడుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటన తర్వాత పలు హామీలను ఇవ్వడం జరిగిందని SGC గుర్తు చేసింది. కానీ...ఇంత వరకు సమస్యలు పరిష్కారం కాలేదని.. పేర్కొంటూ శనివారం సాయంత్రం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మూడు మెస్‌ల కాంట్రాక్టులను జూలై 20 నాటికి రద్దు చేస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం పదార్థాలు కొనుగోలు చేయబడతాయని చెప్పినా.. అలాంటిదేమీ జరగడం లేదన్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్‌కు చెందిన సిబ్బంది అంతా త్వరలో రాజీనామా చేస్తారని చెప్పారని గుర్తు చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు విమర్శలు చేస్తున్నారు. మెస్ మేనేజ్‌మెంట్‌కి ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏమైనా వివరణ ఇచ్చారా అని నిలదీశారు. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన ఆహారం యొక్క పరీక్ష నమూనాలపై ఇచ్చిన నివేదికలో ఏముందని.. బహిరంగంగా ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. జూలై 24వ తేదీ నాటికి మెస్ ల కోసం కొత్త టెండర్లు పిలవాలని చెప్పి.. జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులు చేపడుతున్న నిరసనపై ట్రిపుల్ ఐటీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
