కర్నాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బొమ్మై

కర్నాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బొమ్మై

కర్నాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో బసవరాజ్ బొమ్మై చేత ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చాంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం యడియూరప్ప హాజరయ్యారు. సోమవారం సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా.. మంగళవారం బసవరాజ్ బొమ్మైను బీజేపీ ఎమ్మెల్యేలు శాససభాపక్షనేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకు కర్నాటక 20వ ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు.

యడియూరప్ప సూచనల మేరకే బొమ్మైను కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్  ఎంపిక చేసింది. పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను సంతృప్తిపరుస్తూ అదే వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైకి అవకాశం కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టే ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన బొమ్మైకు ఈ అవకాశం రావడంతో.. ఆ సామాజిక వర్గంలో ఉత్సాహం పెరిగింది.  బీజేపీ సీఎంలకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, పార్టీలో సుదీర్ఘ సభ్యత్వం ఉండాలన్న సంప్రదాయాన్ని బసవరాజ ఎంపికలో అధిష్ఠానం పక్కన బెట్టింది. కర్నాటకలో బలమైన సామాజికవర్గంగా ఉన్న లింగాయత్ నేతకే సీఎం పదవిని కట్టబెట్టింది.

బసవరాజ్ బొమ్మై రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. ఎస్ఆర్‌ బొమ్మై 1988 నుంచి 1989లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. 1960 జనవరి 1న హుబ్బళ్లిలో బసవరాజ్ బొమ్మై జన్మించారు. 61 ఏళ్ల బసవరాజ్ మెకానికల్‌ ఇంజినీరింగ్‌‌లో పట్టభద్రుడు. పుణె టెల్కో కంపెనీలో సాంకేతిక సలహాదారుడిగా, సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. నీటిపారుదల రంగంలో విశేష పరిజ్ఞానం ఉంది. బసవరాజ్ బొమ్మై కొన్నాళ్లు జేడీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, 1996 నుంచి 1997 వరకు నాటి ముఖ్యమంత్రి జె.హెచ్‌.పటేల్‌కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. 2005 వరకు రెండుసార్లు విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. 2006లో బీజేపీలో చేరిన ఆయన.. హావేరి జిల్లా శిగ్గాం ఉంచి వరుసగా మూడుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు.