
తాజాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుల్లో భాగంగా చిన్న వాహనాలపై గతంలో ఉన్న 28 శాతం పన్ను రేటును ప్రస్తుతం 18 శాతానికి తగ్గించింది. ఇదే క్రమంలో లగ్జరీ కార్లు, హైఎండ్ మోటార్ బైక్స్ పై జీఎస్టీని 40 శాతంగా నిర్ణయించారు. ఈ క్రమంలో కారు బైక్ లేదా వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్ లాంటి వాహనాలను కొనాలనుకుంటున్న వారు నవరాత్రి తర్వాత జీఎస్టీ ఎంత సీసీకి ఎలా ఉన్నాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
కార్లపై జీఎస్టీ ఇలా..
1200 సీసీ వరకు ఉన్న పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ కార్లపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇదే క్రమంలో 1500 సీసీ వరకు ఉండే డీజిల్ కార్లపై కూడా 18 శాతం జీఎస్టీ ఉంటుంది. దీంతో మారుతీ స్విఫ్ట్, హుందాయ్ ఐ20, టాటా ఆట్రోజ్, హోండా అమేజ్ వంటి కార్ల రేట్లు తగ్గనున్నాయి.
ఇక 1200సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ పెట్రోల్ సీఎన్జీ పీఎన్జీ కార్లపై 40 శాతానికి జీఎస్టీ పెంచింది గవర్నమెంట్. 1500 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ డీజిల్ కార్లకు కూడా ఇదే రేటు వర్తించనుంది. దీంతో ప్రీమియం ఎస్ యూవీలు, టయోటా ఫార్చునర్, మహీంద్రా ఎక్స్యూవీ 700 వంటి కార్లపై 40 శాతం జీఎస్టీ వసూలు చేయనుంది ప్రభుత్వం.
టూవీలర్లపై జీఎస్టీ రేట్లు ఇలా..
350 సీసీ కంటే తక్కువ ఇంజన్ కెపాసిటీ కలిగిన బైక్స్ పై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీని ప్రస్తుతం 18 శాతానికి తగ్గించారు. ఇదే క్రమంలో 350 సీసీ కంటే కెపాసిటీ ఎక్కువ వాహనాలపై జీఎస్టీ 40 శాతానికి పెంచబడింద. దీంతో రాయల్ ఎన్ ఫీల్డ్ 650 సీసీ, హార్లీ డేవిడ్ సన్, కేటీఎం వంటి బైక్స్ 40 శాతం జీఎస్టీ కిందికి వచ్చాయి.
ALSO READ : GST తగ్గింపుతో చిన్న కార్లతో పాటు లగ్జరీ కార్ల రేట్లూ తగ్గుతున్నయ్..!
ట్రాక్టర్లపై పన్ను ఇలా..
ట్రాక్టర్లు వాటి టైర్లు, బ్రేక్స్, రేడియేటర్లు, క్లచ్ వంటి విడి భాగాలపై 5 శాతం జీఎస్టీని నిర్ణయించారు. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించింది. అయితే ఆటో లాంటి త్రీవీలర్లకు మాత్రం 18 శాతం జీఎస్టీ అమలు కానుంది. అలాగే పెద్ద ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు జీఎస్టీని 18 శాతంగా ఫిక్స్ చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ..
దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గతంలో మాదిరిగా 5 శాతం వద్దే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈవీ కార్ల విషయంలో కూడా జీఎస్టీ 5 శాతంగా కొనసాగనుంది.