
భద్రాచలం, వెలుగు: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడవి హిడ్మాను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ, చత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ హిడ్మా’పేరిట స్పెషల్ ఫోర్స్‌ను రంగంలోకి దించాయి. ‘హిడ్మా మా రాడార్ పరిధిలోనే ఉన్నాడు. లొంగిపో.. లేకుంటే చచ్చిపోతావ్’అంటూ బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తాజా ప్రకటనలో హెచ్చరించారు.
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా వువ్వర్తి గ్రామానికి చెందిన హిడ్మా 17 ఏండ్ల వయసులోనే పీపుల్స్ వార్ పార్టీలో 1996–-97 సంవత్సరంలో చేరి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, సెంట్రల్‌కమిటీ మెంబర్ స్థాయికి ఎదిగారు. 2010లో తాడిమెట్లలో 76 మంది జవాన్లను మట్టుబెట్టిన ఘటనలో మాస్టర్ మైండ్ హిడ్మానే. అప్పటి నుంచి హిడ్మాను పట్టుకునేందుకు ఎన్నో ఆపరేషన్లు జరిగాయి.
కానీ నిఘా వర్గాల వద్ద అతని పాత ఫొటో మాత్రమే ఉండటంతో ఆయనను పట్టుకునేందుకు కష్టమైంది. ప్రస్తుతం ఎలా ఉన్నాడో కూడా భద్రతా దళాలకు తెలియదు. అయితే, ఇటీవల లొంగిన కొంతమంది మావోయిస్టుల ద్వారా హిడ్మా తాజా ఫొటో సంపాదించారు. దీంతో కేంద్రం, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ‘ఆపరేషన్ హిడ్మా’కు శ్రీకారం చుట్టారు.