
7 అంశాలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: సిటీలో వివాదంలో లేని ప్రభుత్వ స్థలాల్లో బస్తీ దవాఖానలు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల ఏర్పాటుకు బల్దియా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత రెండోసారి ఎన్నికైన స్టాండింగ్ కమిటీ మీటింగ్ బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా హెడ్డాఫీసులో జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యులను మేయర్ ఆహ్వానించి విషెస్ తెలిపారు. డీఆర్డీఎల్ నుంచి జీహెచ్ఎంసీ లిమిట్ రోడ్ వెడల్పు పనులకు 216 ఆస్తుల సేకరణ, ఖైరతాబాద్ జోన్ బల్కాపూర్ నాలా మిలటరీ ఏరియా నుంచి ఏక్ మినార్ మదీనా మసీదు వరకు సీవరేజ్ పైప్ లైన్, మెహిదీపట్నం గారిసన్ లోపల నుంచి ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్, బస్తీ దవాఖానా, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులతో పాటు మొత్తం 7 అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది.
అనంతరం మేయర్ మాట్లాడుతూ.. గ్రేటర్లో అభివృద్ధి పనులకు అధికారుల సమక్షంలో చర్చించిన తర్వాత తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలుపుతారన్నారు. కార్పొరేటర్లు అధికారుల వద్ద ఎలాంటి సమాచారాన్ని అయినా నేరుగా తీసుకోవచ్చని చెప్పారు. వివాదం లేని ప్రభుత్వ ఖాళీ స్థలలాను గుర్తించి, బస్తీ దవాఖానాలు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను కడతామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తగు ఆదేశాలు జారీచేసినట్లు కమిషనర్ లోకేశ్‌కుమార్ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో సభ్యులు సునీత, రాగం నాగేందర్ యాదవ్, అబ్దుల్ వాహెబ్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు.