
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ప్రతీ ఏడాది అస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆగస్టు 23వ తేదీ రాత్రి బత్తిని హరినాథ్ గౌడ్ చనిపోయారు. బత్తిని హరినాథ్ గౌడ్ కు భార్య సుమిత్రాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బత్తిని సోదరులైన హరినాధ్‌గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివరాంగౌడ్, సోమ లింగం గౌడ్,ఉమా మహేశ్వర్ గౌడ్ లు హైదరాబాద్ లో చేపమందు పంపిణీ చేస్తున్నారు. సుమారు 170 ఏళ్ల నుంచి బత్తిన వంశస్తులు అస్తమా పేషెంట్లకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు. అప్పట్లో పాతబస్తీలో పంపిణీ చేసేవారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు మార్చారు.
కొర్రమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్‌లో పెట్టి విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బులిచ్చి.. చేప పిల్లలను కొనుక్కుంటారు. ఉబ్బసం రోగుల ఇబ్బందుల నుంచి ఊరటనిస్తుందని విశ్వసించే బత్తిని బ్రదర్స్ చేపమందు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు చేప మందు కోసం తరలివస్తారు.
శాకాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదం ఇస్తారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు చేపమందును పంపిణీ చేస్తారు. గర్భిణులకు మాత్రం ఇవ్వరు. పరగడుపున కానీ.. భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత కానీ మందు ఇస్తారు.