సొంతూర్లకు..సిటీ జనం

సొంతూర్లకు..సిటీ జనం
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ
  • శివార్లతో పాటు టోల్ ప్లాజాల వద్ద  ట్రాఫిక్ జామ్

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగను జరుపుకునేందుకు సిటీ జనం సొంతూరి బాట పట్టారు. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ ఏరియాల్లో శనివారం ఫుల్ రష్ కనిపించింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సిటీ నుంచి ఏపీకి వెళ్లే వారితో ఎల్​బీనగర్ బస్టాప్ ఏరియాలో రద్దీ నెలకొంది. సిటీ నుంచి చాలామంది ఓన్​ వెహికల్స్​లో సొంతూర్లకు బయలుదేరగా.. శివారు ప్రాంతాలతో పాటు బీబీనగర్ టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా వద్ద  కిలోమీటర్ల  మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరబాద్– విజయవాడ హైవేపై వెహికల్స్ చాలాసేపు ట్రాఫిక్​లో నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు సైతం జరుగుతుండటంతో ట్రాఫిక్​ మూవ్​మెంట్ స్లోగా సాగింది. దీంతో ఓన్ వెహికల్స్​లో ఊర్లకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

ఊర్లకు వెళ్లే వారికి పోలీసుల సూచనలు  

 పండుగకు సొంతూర్లకు వెళ్లే వారిని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. డబ్బు, బంగారు నగలు సహా విలువైన వస్తువులను ఇండ్లలో పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు.శివారు ప్రాంతాల్లోని గేటెడ్‌‌ కమ్యూనిటీలు, కాలనీల్లో ఆటోలతో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఊర్లకు వెళ్ళే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో, కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు తిరిగితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.  డబ్బు, బంగారం, వెండి బ్యాంక్ లాకర్స్‌‌లో భద్రపరచాలని, ఇంటి లోపల, బయట సీసీ కెమెరాలను ఆన్‌‌లోనే ఉంచాలని చెబుతున్నారు. నమ్మకమైన వారిని మాత్రమే వాచ్‌‌మన్‌‌గా పెట్టుకోవాలని, ఇంట్లో, బయట లైట్లు ఆన్‌‌లో ఉంచాలన్నారు. సొంతూరికి వెళ్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయొద్దని సూచించారు.