
బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం
అంబర్ పేటలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్న కుంటకు జీవం పోసిన హైడ్రా
బతుకమ్మ పండుగ నాడు ప్రారంభించనున్న సీఎం
ఇకపై ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వ బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ అంబర్ పేటలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్న బతుకమ్మ కుంటకు హైడ్రా జీవం పోసింది. పూర్తిగా నామ రూపాలు లేకుండా పోయిన బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం తీసుకొచ్చింది. చెట్లు, చెత్త, పిచ్చి మొక్కలతో పేరుకుపోయిన ఈ కుంటను చెరువుల పునరుద్ధరణలో భాగంగా నీటితో కళకళలాడేలా మార్చేసింది.
1962–63 లెక్కల ప్రకారం ఇక్కడ14 ఎకరాల 6 గుంటల (బఫర్ జోన్ తో కలిపి16 ఎకరాల13 గుంటలు) చెరువు భూమి ఉండేది. క్రమంగా ఆక్రమణలకు గురికాగా, తాజాగా హైడ్రా నిర్వహించిన సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటల భూమి మిగిలి ఉన్నట్లు గుర్తించింది. ఈ భూమిలో సుందరీకరణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టింది.
అయితే, ఈ భూములు తమవేనని కోర్టులో కొందరు కేసులు వేయగా, ఆ కేసులను హైడ్రా దీటుగా ఎదుర్కొంది. అవి చెరువు భూములేనని కోర్టు తీర్పు ఇవ్వడంతో అభివృద్ధి పనులు మొదలుపెట్టింది. 5 ఎకరాల 12 గుంటల్లో ఉన్న కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా రూ.7 కోట్లతో బతుకమ్మ కుంటను హైడ్రా డెవలప్ చేస్తోంది. కుంట చుట్టూ రాళ్లతో గట్టును ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
దాదాపు 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. మొదటి దశలో ఆరు చెరువులను అభివృద్ది చేయాలని హైడ్రా నిర్ణయించగా, అందులో మొదటిదైన బతుకమ్మ కుంట దాదాపు పూర్తి కావస్తోంది.
ప్రారంభించనున్న సీఎం
బతుకమ్మ పండుగ నాటికి పనులు పూర్తి కానుండగా బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి బతుకమ్మ పండుగను ఇక్కడే అధికారికంగా నిర్వహించనున్నారు. చెత్త, పొదలతో నిండి ఆనవాళ్లు లేకుండా పోయిన బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు హైడ్రా పనితీరును అభినందిస్తున్నారు.
బెంగళూరు ఇంజనీర్ల బృందం సందర్శన..
హైడ్రా డెవలప్ చేస్తున్న బతుకమ్మ కుంటను పరిశీలించడానికి బెంగళూరు ఇరిగేషన్ ఇంజనీర్ల టీమ్ వచ్చింది. కబ్జాకు గురైన చెరువులను కాపాడి సుందరీకరిస్తున్న తీరును బెంగళూరు ఇంజనీర్ల బృందానికి హైడ్రా అధికారులు వివరించారు. బతుకమ్మ కుంట, ఓల్డ్ సిటీలోని బుమృక్ కుంటతో పాటు హైడ్రా సుందరీకరిస్తున్న ఆరు చెరువులను బెంగళూరు బృందం విజిట్చేసింది. కబ్జాకు గురైన చెరువులకు జీవం పోస్తున్న తీరు బాగుందని బెంగళూరు ఇంజనీర్ల బృందం సభ్యులు హైడ్రాను అభింనందించారు.