28 నుంచి 6 వరకు బతుకమ్మ వేడుకలు

28 నుంచి 6 వరకు బతుకమ్మ వేడుకలు

ఈ నెల 28న వరంగల్​లోని భద్రకాళి దేవాలయంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభిస్తామని, వచ్చే నెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని మంత్రులు శ్రీనివాస్​గౌడ్, శ్రీనివాస్​యాదవ్​తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లోని హోటల్ హరిత ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణపై రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ బ్రోచర్‌‌‌‌ను విడుదల చేశారు. రాష్ట్రంతోపాటు ముంబై, బెంగళూరు, కర్నాటకలోనూ బతుకమ్మ పండుగను జరుపుకుంటామని అంటున్నారని, వారికి ఎలాంటి సహాయం కావాల్సినా చేస్తామని తెలిపారు. చివర రోజు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్​బండ్​ వరకు ర్యాలీ ఉంటుందని, ముగింపు వేడుకలు ట్యాంక్​బండ్​ వద్ద జరుగుతాయన్నారు. తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే పండుగలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో టూరిజం శాఖ కార్యదర్శి పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.

ఏడు దేశాల్లో సంబురాలు

ఇండియాతోపాటు మరో ఆరు దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తెలిపారు. మంగళవారం తన నివాసంలో పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో వేడుకలు నిర్వహిస్తున్నామని, న్యూజిలాండ్‌‌‌‌, ఆస్ట్రేలియా, యూకే, ఖతార్‌‌‌‌, బహరైన్‌‌‌‌, కువైట్‌‌‌‌ దేశాల్లో ఈ నెల 28 నుంచి అక్టోబర్‌‌‌‌ 6 వరకు ఉత్సవాలు చేస్తామని తెలిపారు. 300 మంది కవయిత్రులతో మహా కవి సమ్మేళనం, ఆర్ట్‌‌‌‌ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రీతిరెడ్డి, వరలక్ష్మి, నవీన్‌‌‌‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు.