కేసీఆర్‎ను నేనేందుకు జైల్లో వేస్తా.. ఫామ్‎హౌజ్‎లో ఆయనే బందీ అయ్యారు: సీఎం రేవంత్

కేసీఆర్‎ను నేనేందుకు జైల్లో వేస్తా.. ఫామ్‎హౌజ్‎లో ఆయనే బందీ అయ్యారు: సీఎం రేవంత్

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‎పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్‎ను నేనేందుకు జైల్లో వేస్తానని.. ఫామ్‎హౌజ్‎లో ఆయనకు ఆయనే బందీ అయ్యారన్నారు. కేసీఆర్ ఫామ్‎హౌస్‎కు.. చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏముందని.. ఫామ్‎హౌజ్‎లో పర్యవేక్షణ ఉంటుంది.. జైల్లో పహారా ఉంటుంది అంతేనన్నారు రేవంత్ రెడ్డి. ఇంకా కొత్తగా ఆయన్ని జైల్లో పెట్టి శిక్షిందేముందని.. ప్రజలు ఓడించి ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయడమే కేసీఆర్‎కు పెద్ద శిక్ష అన్నారు. నెక్ట్స్ టైమ్ కూడా రాష్ట్రంలో అధికారం మాదేనని.. ఇక కేసీఆర్ దుప్పటి కప్పుకుని ఫామ్‎హౌస్‎లో పడుకోవాల్సిందేనని హాట్ కామెంట్ చేశారు. 

ALSO READ | 10 రోజుల క్రితమే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం.. మోడీ, అమిత్ షా అడ్డుకున్నరు: సీఎం రేవంత్

మేం దుప్పటి కప్పుకోని పడుకున్నా చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి ప్రజలే మళ్లీ మమ్నల్ని గెలిపిస్తారన్నారు. ఇతరుల ఇంటి వ్యవహరాల్లో వేలు పెట్టకుంటే అధికారం దానంతట అదే వస్తదని బీఆర్ఎస్‎కు చురకలంటించారు. తాను ద్వేశపూరిత రాజకీయాలు చేయడం లేదని.. బీఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఇక, జూబ్లీహిల్స్ బై పోల్ గురించి మాట్లాడుతూ..  బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పి్స్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో బుధవారం (ఆగస్ట్ 6) తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం (ఆగస్ట్ 7) అక్కడే మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‎గా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.