
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుల గణన నివేదిక ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని.. ఇందుకుగానూ అసెంబ్లీలో రెండు బీసీ బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ బిల్లులు నాలుగు నెలలుగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ALSO READ | మోదీ చేతుల్లోనే బీసీ బిల్లు.. మా చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు : సీఎం రేవంత్ రెడ్డి
గురువారం (ఆగస్ట్ 7) ఢిల్లీలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం కోటా దాటొద్దని 2018లో అప్పటి సీఎం కేసీఆర్ చట్టం చేశారని.. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించామని ఆ ఆర్డినెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. బీసీ బిల్లులకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూనే ఢిల్లీలో ధర్నా చేపట్టామని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ వచ్చామన్నారు.
రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ల బిల్లుల గురించి చర్చించేందుకు 10 రోజుల క్రితమే రాష్ట్రపతి అపాయిట్మెంట్ కోరామని, కానీ ప్రధాని మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ రాకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్రపతి అపాయిట్మెంట్ ఇస్తే మా బాధలు చెప్పుకునేవాళ్లమని, బీసీ బిల్లులు ఆమోదించాలని కోరే వాళ్లమన్నారు. రాష్ట్రపతి అపాయిట్మెంట్ ఇవ్వకుండా బీజేపీ కుట్ర చేస్తోందని, రాష్ట్రపతి అపాయిట్మెంట్ దొరకకపోవడం బాధకరమని పేర్కొన్నారు.