IND vs SL: టీమిండియాతో శ్రీలంక వన్డే, టీ20 సిరీస్.. క్లారిటీ ఇచ్చిన లంక క్రికెట్ బోర్డు

IND vs SL: టీమిండియాతో శ్రీలంక వన్డే, టీ20 సిరీస్.. క్లారిటీ ఇచ్చిన లంక క్రికెట్ బోర్డు

బంగ్లాదేశ్ తో వైట్ బాల్ ఫార్మాట్ సిరీస్ రద్దు కావడంతో ఆగస్ట్ నెలలో టీమిండియా శ్రీలంకలో పర్యటించే సూచనలు ఉన్నట్టు గత నెలలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగించుకొని ఖాళీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన బంగ్లాదేశ్ సిరీస్ బీసీసీఐ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లా సిరీస్ కు బ్రేక్ పడడంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాకు ఈ నెలంతా ఖాళీగా ఉండనుంది. బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డు కలిసి ఇండియా, బంగ్లా సిరీస్ ను ఇండియా, శ్రీలంక సిరీస్‌తో భర్తీ చేయడానికి చర్చలు జరిగాయనే ఊహాగానాలు వ్యాపించాయి. 

ఈ గ్యాప్ లో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనున్నటు వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆగస్టు నెలలో టీమిండియాతో ఎలాంటి మ్యాచ్ లు ఆడట్లేదని ధృవీకరించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ కు ఏదో మూల ఉన్న ఆశలు పోయాయి. చివరిసారిగా శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు వన్డేల్లో 1-2 తేడాతో సిరీస్ ఓడిపోయింది. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఈ సిరీస్ ఆడినప్పటికీ టీమిండియాకు సిరీస్ ఓటమి తప్పలేదు. 

ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2తో సమం చేసుకున్న భారత క్రికెట్ జట్టు ఆగస్టు నెలలో ఖాళీగా ఉండబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత సుదీర్ఘ ఐపీఎల్, ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడి అలసిపోయిన మన ఆటగాళ్లకు ఎట్టకేలకు భారీ గ్యాప్ లభించింది. సెప్టెంబర్ లో జరగనున్న ఆసియా కప్ లో టీమిండియా మళ్ళీ క్రికెట్ బాట పడనుంది.  టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది.