Viral Video: ఈ వీడియో చూశాక.. బయట తినేవాళ్లపై జాలేస్తుంది.. మరీ ఇంత దారుణమా..?

Viral Video: ఈ వీడియో చూశాక.. బయట తినేవాళ్లపై జాలేస్తుంది.. మరీ ఇంత దారుణమా..?

మన దేశం స్ట్రీట్ ఫుడ్కు పెట్టింది పేరు. ఎక్కడా లేని వెరైటీ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ మన దేశంలో దొరుకుతాయి. విదేశీయులు కూడా మన స్ట్రీట్ ఫుడ్స్ అంటే పడిచస్తారు. అంతా బానే ఉంది గానీ హైజీన్ను మాత్రం కొన్ని ఫుడ్ స్టాల్స్ పూర్తిగా గాలికొదిలేస్తున్నాయి. వీధుల్లో రోడ్ల పక్కన వండివడ్డించే ఫుడ్ సుచీశుభ్రత విషయంలో ఆమడ దూరంలో ఉంటుండటం ఆందోళన కలిగించే విషయం. 

అసలే ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న క్రమంలో బయట తినాలంటేనే భయపడే పరిస్థితులున్నాయి. ఏం నూనె వాడతారో, రోడ్ల పక్కన వంట చేస్తుంటే ఆ డస్ట్ అంతా ఆ నూనెలో పడి.. అది మన కడుపులోకి పోయి ఏ అనారోగ్య సమస్య ముంచుకొస్తుందోననే భయంతో కొందరు స్ట్రీట్ ఫుడ్స్ తినడమే మానేశారు. ఇప్పటికీ వీటన్నింటినీ పట్టించుకోకుండా తినేవాళ్లూ ఉన్నారు. కానీ.. ఈ వీడియో చూస్తే వాళ్లు కూడా ఒక్క క్షణం తినడానికి ఆలోచిస్తారేమో.

పంజాబ్లోని లూథియానాలో KALRA MEDICAL STORE ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద వేడివేడి నూనెలో ముంచి లేపిన బ్రెడ్ టోస్ట్లు ఆ ఏరియాలో ఎగబడి తింటున్నారు. పది రూపాయలకే ప్లేట్ బ్రెడ్ టోస్ట్ ఇస్తుండటంతో ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ కస్టమర్లతో కళకళాడుతోంది. అంతా బానే ఉందిగా అనుకుంటున్నారేమో. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ బ్రెడ్ టోస్ట్ల మేకింగ్ వీడియో చూస్తే మీకు కడుపులో తిప్పడం ఖాయం.

అది పామాయిలో లేదా ఇంకేదో నూనెనో అనే సంగతి పక్కనపెడితే.. నూనె ప్యాకెట్లను సలసలకాగుతున్న నూనె బాండీలో నేరుగా తీసుకొచ్చి ముంచేస్తున్నాడు. ఆ వేడికి నూనె ప్యాకెట్లకు ఎలాంటి రంధ్రం చేయకుండానే కరిగిపోయి ఆ నూనెంతా బాండీలో పడుతోంది. నూనెతో పాటు ఆ నూనె ప్యాకెట్లు ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కూడా బాండీలో మరుగుతున్న నూనెలో కలిసిపోయింది. ఆ నూనెలో బ్రెడ్ టోస్ట్లు తయారుచేసి కస్టమర్లకు అమ్ముతున్నాడు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.

ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై కనిపిస్తుంటేనే ఏరి రీసైక్లింగ్కు పంపిస్తున్న ఈరోజుల్లో ఈ ఫుడ్ స్టాల్ ఓనర్ ఏకంగా కస్టమర్ల కడుపుల్లోకే  మైక్రో ప్లాస్టిక్ను పంపిస్తుండటం గమనార్హం. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. మెడికల్ షాప్ ఎదురుగా ఈ ఫుడ్ స్టాల్ ఉండటం ఇక్కడ మరో ట్విస్ట్. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేస్తున్న ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇలాంటివి తినే బదులు అంతగా ఆకలేస్తే రెండు అరటిపళ్లు కొనుక్కుని తినడం బెటర్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.