
- ఊరూరా తొమ్మిది రోజులపాటు వేడుకలు
- సద్దుల బతుకమ్మ దాకా పూల జాతర
- పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఆడబిడ్డల సందడి
- పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తొలిరోజు
- వరంగల్ జిల్లా వేయి స్తంభాల గుడిలో వేడుకలు
- హాజరు కానున్న మంత్రులు సురేఖ, సీతక్క, జూపల్లి
హైదరాబాద్, వెలుగు: పూల జాతరకు వేళైంది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఊరూరా వేడుకల్లో పాల్గొనేందుకు మహిళలు రెడీ అయ్యారు. పెత్తరమాస ఎంగిలిపూలతో మొదలై.. ఇక సద్దుల బతుకమ్మ దాకా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సందడి నెలకొననున్నది. ‘బతుకమ్మ .. బతుకమ్మ ఉయ్యాలో’.. అంటూ ఉయ్యాల పాటలతో ఉత్సాహం నిండనున్నది. ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణ మార్మోగనున్నది. తొలిరోజు ఆదివారం వరంగల్ జిల్లాలోని వేయిస్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మతో సంబురాలు ప్రారంభం కానున్నాయి.
ఈ వేడుకలకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు.అన్ని జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు పండుగ నిర్వహించనుండగా.. సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకూ సెలవులు ప్రకటించడంతో పల్లెల్లో పండుగ సందడి మొదలైంది. ఈ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటింది. దేశవిదేశాల్లోనూ నిర్వహించుకునేందుకు తెలంగాణ ఆడ బిడ్డలు సిద్ధమయ్యారు.
ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు..
బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్తరమాస (పితృ అమావాస్య) అని పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి.. లాంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడటం సాంప్రదాయం. తొలిరోజున పేర్చిన బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అని పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరుబయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాలు వద్దకు వెళ్లి సేకరిస్తారు.
తీరొక్క పూలను తెచ్చి ఇంట్లో నిల్వ చేస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడుతారు. బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తర్వాత బతుకమ్మ తయారు చేస్తారు.. కాబట్టి ఎంగిలి పడటం అంటారు.
తెలంగాణ సంస్కృతికిప్రతీక బతుకమ్మ : మంత్రి జూపల్లి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
బతుకమ్మ..తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆడ బిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
యువ కళాకారులు ప్రపంచానికి తమ సృజన చాటాలి
- బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ చాలెంజ్ పోటీల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్’ పోటీలకు సంబంధించిన బ్రోచర్, పోస్టర్‌లను ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో రిలీజ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని మంత్రి సూచించారు. ఎంట్రీలు పంపేందుకు ఈ నెల 30వ తేదీ తుదిగడువు. ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.com లేదా 81258 34009 నంబర్‌కు వాట్సప్ చేయాలి.