తెలంగాణకు సహాయం చేస్తే చేయాలి గానీ ఇబ్బందులు పెట్టొద్దు

తెలంగాణకు సహాయం చేస్తే చేయాలి గానీ ఇబ్బందులు పెట్టొద్దు

ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బతుకమ్మ వేడుకలకు ఆంక్షలు పెట్టేవారని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఢిల్లీలో పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర క్రీడా శాఖ, సాంస్కృతిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో సాంస్కృతి సంప్రదాయాలు చాలా బాగున్నా.. 75 సంవత్సరాలుగా రాష్ట్ర సాంస్కృతిని తొక్కి పెట్టారని చెప్పారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున తెలంగాణ భవన్ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మహిళలతో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

బతుకమ్మ సందర్భంగా గత కొన్నేళ్లుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, ఢిల్లీలోనూ తెలుగు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఢిల్లీలోని తెలుగు వారందరినీ ఏకం చేసేలా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టూరిజం మూడో స్థానంలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర చాలా ఉందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గతంలో పంజాబ్ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసేవాళ్లమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్..  దేశంలోని సగం రాష్ట్రాలకు అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే చేయాలి గానీ ఇబ్బందులు మాత్రం పెట్టొదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు మాత్రం అన్నదమ్ముల మాదిరిగా అందరూ కలిసి ఉంటున్నామని చెప్పారు.